ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం మంత్రి మండలి రద్దు..?

by Vinod kumar |   ( Updated:2022-04-07 11:56:53.0  )
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం మంత్రి మండలి రద్దు..?
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో మరికాసేపట్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. గురువారం సాయంత్రం మంత్రి మండలి రద్దు కానుంది. కేబినెట్ భేటీ అనంతరం సీఎం వైఎస్ జగన్ మంత్రుల దగ్గర నుంచి రాజీనామాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సచివాలయంలో ప్రస్తుతం చివరి కేబినెట్ భేటీ జరుగుతుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశం ప్రస్తుతం ఉన్న మంత్రులకు చివరిది కావడం గమనార్హం. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు అంతా రాజీనామా చేస్తారని తెలుస్తోంది.

ప్రస్తుతం కేబినెట్ భేటీ జరుగుతుంది. కొత్తపేట రెవెన్యూ డివిజన్‌కు ఆమోదం తెలపడంతోపాటు రంపచోడవరం కేంద్రంగా కొత్త గిరిజన జిల్లా ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే సంగం బ్యారేజికి గౌతమ్ రెడ్డి పేరు పెట్టడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అలాగే సీపీఎస్ రద్దుపై అధికారుల కమిటీ వేయడం పై చర్చించే అవకాశం ఉంది. అలాగే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటితోపాటు గిరిజన ప్రాంతాల్లో ఆర్వోఎఫ్ పట్టాల కేటాయింపు, పలు సంస్థలకు భూకేటాయింపులకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం. మొత్తం 40 అంశాలు ఈ చివరి కేబినెట్ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

కేబినెట్ భేటీ అనంతరం రాజీనామాలు..?

కేబినెట్ భేటీ అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులకు పలు సూచనలు చేస్తారని తెలుస్తోంది. మంత్రి పదవుల నుంచి వైదొలుగుతున్న వారికి కట్టబెట్టే బాధ్యతలపై హామీలు ఇస్తారని తెలుస్తోంది. సమావేశం అనంతరం మంత్రులంతా తమ రాజీనామాలను నేరుగా సీఎం జగన్‌కు అందజేస్తారని తెలుస్తోంది. అనంతరం మంత్రులు ఇచ్చిన రాజీనామా పత్రాలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దగ్గరకు సీఎం జగన్ స్వయంగా తీసుకువెళ్తారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతుంది.

అదే సమయంలో కొత్త మంత్రి వర్గ జాబితాను సైతం గవర్నర్ బీబీ హరిచందన్‌కు అందజేసి ఆమోదముద్ర వేయించుకుంటారని తెలుస్తోంది. ఇదే అంశంపై బుధవారం గవర్నర్‌తో జరిగిన భేటీలో చర్చించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇకపోతే నూతన కేబినెట్‌లో బెర్త్ ఎవరికి దక్కుతుంది.. ప్రస్తుత కేబినెట్‌లో ఎవరు ఉంటారు అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

భావోద్వేగానికి గురైన మంత్రులు..

సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశానికి మంత్రులు అంతా హాజరయ్యారు. అయితే మీడియా ఎదుట పలువురు మంత్రులు తమ భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. ఇదే చివరి సమావేశం కావడం పట్ల వారంతా బాధాతప్త హృదయంతో సమావేశానికి వెళ్లారు. అంతేకాదు ప్రతీ మంత్రి లెటర్‌హెడ్‌లను వెంట తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమకు ఇచ్చిన అవకాశం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తనకు మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ మంత్రిగా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రాజీనామా చేయమని సీఎం జగన్ ఆదేశిస్తే.. ఆయన కాళ్ల ముందు తల వంచి రాజీనామా చేస్తానని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రకటించారు.

నేను మళ్లీ మంత్రి కావాలనే ఆశ లేదు. ఎల్లకాలం సీఎంగా జగన్ ఉండాలన్నదే నా కోరిక. నాకు ఎంతో గౌరవం ఇచ్చిన వైఎస్ఆర్ ఫ్యామిలీకి జీవితాంతం రుణపడి ఉంటాను అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత ప్రమాణాలు కలిగిన వ్యక్తి. ఆయన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసేందుకు శాయశక్తులా పనిచేశాను. విద్యాశాఖ మంత్రిగా సీఎం జగన్ నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. జగన్ నేతృత్వంలో పనిచేయడం ఎంతో గర్వంగా ఫీలవుతున్నా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం నా తల తీసుకోవడానికి కూడా సిద్ధమేనంటూ ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

బ్రేకింగ్: ఏపీలో మంత్రులు రాజీనామా

Advertisement

Next Story