సైనికులకు నివాళులర్పించేందుకు సోలో బైక్ రైడ్ చేస్తున్న కేరళ మహిళ!

by S Gopi |
సైనికులకు నివాళులర్పించేందుకు సోలో బైక్ రైడ్ చేస్తున్న కేరళ మహిళ!
X

దిశ, ఫీచర్స్ : కేరళ, కొచ్చికి చెందిన 44 ఏళ్ల అంబికా కృష్ణ బైక్ నుంచి పడటంతో మోకాలకు దెబ్బతగిలి నడవగలిగే సామర్థ్యం కోల్పోయి ఏప్రిల్‌లో ఆస్పత్రి పాలైంది. అప్పుడు కూడా ఆమె తన మిషన్ గురించే ఆలోచిస్తూ ఉండేది. నిజానికి ఆ మిషన్ వల్లే తనకు ఈ స్థితి వచ్చింది. అయినా సరే దేశ సైనికుల గౌరవార్థం భారతదేశమంతటా బైక్ రైడింగ్ చేయాలనే తన నిర్ణయాన్ని ఏమాత్రం మార్చుకోలేదు. ఇంతకీ ఆమెకు యాక్సిడెంట్ ఎలా అయింది? తన మిషన్ ఏంటి?

కేరళకు చెందిన అంబికకు ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తితో పెళ్లయింది. పెళ్లయి ఏడాది తర్వాత ఓ పండంటి బిడ్డకు జన్మినిచ్చారు. కానీ పాప పుట్టి మూడు నెలలు కూడా కాకముందే తన భర్తను ఒక ప్రమాదంలో కోల్పోయింది. భర్త మరణం తర్వాత అంబిక అకౌంటెంట్‌గా పని చేయడం ప్రారంభించింది. 2009లో ఆమె కొచ్చిలో AIR FM రెయిన్‌బో 107.5తో రేడియో జాకీగా కొత్త కెరీర్ ప్రారంభించింది. ప్రతిరోజూ గంట పాటు ఆర్జేయింగ్ చేసే తను, 'సందేశ్ టు సోల్జర్స్' అనే ప్రోగ్రామ్ రన్ చేసేది. ఈ క్రమంలో సేవలో ఉన్న సైనికుల కుటుంబం, స్నేహితుల నుంచి అనేక లేఖలు అందుకునేది. అంతేకాకుండా రేడియోలు, సైనికులకు మధ్య చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ఎందుకంటే వారితో ఎల్లప్పుడూ ట్రాన్సిస్టర్ లేదా రేడియో ఉంటుంది. ఈ విషయాలే ఆమెను 'బైక్-అక్రాస్-ఇండియా' మిషన్‌ను ప్రారంభించేందుకు ప్రేరణగా నిలిచాయి. ఈ రైడ్ ద్వారా దేశరక్షణలో మరణించిన భారతీయ సైనికులకు నివాళులర్పిస్తూ, ఆయా సోల్జర్స్ భార్యలను కలిసేందుకు ఏప్రిల్‌లో అంబిక సోలో బైక్ రైడ్ ప్రారంభించింది.

రైడ్ ఆరంభించిన నాలుగు రోజుల్లోనే ఓ కార్ డ్రైవర్ నిర్ల్యక్షపు డ్రైవింగ్ కారణంగా ఆమె బైక్‌ అదుపు తప్పి పడిపోయింది. దీంతో తన ఎడమ మోకాలిలో 80 శాతం లిగమెంట్ పాడైపోయింది. దీంతో డాక్టర్లు ఆమెకు శస్త్రచికిత్స చేయాలని, ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. కానీ ఓ వైద్యుడి సలహాతో ఆయుర్వేద చికిత్స చేయించుకుని కేవలం మూడు వారాల్లోనే కోలుకుంది. అలా ప్రమాదం జరిగిన సరిగ్గా 22 రోజుల తర్వాత, మే 9న మళ్లీ తన ప్రయాణాన్ని మొదలెట్టింది. 'మహిళలు ఏదైనా చేయగలరని నిస్సహాయులకు నిరూపించాలనుకున్నాను. ఒంటరిగా ఉన్నందున మనం అసమర్థులం కాదనే సందేశం ఇవ్వాలనుకున్నాను' అని తెలిపింది.

కృష్ణ ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఏడెనిమిది గంటల పాటు నిరంతరాయంగా రైడ్ చేస్తుంది. ఆమె ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లు మరియు AIR-సదుపాయం ఉన్న వసతి గృహాల ప్యాచ్‌వర్క్‌లో విశ్రాంతి తీసుకుంటుంది. వెళ్లిన ప్రతిచోటా ఆమెను హృదయపూర్వకంగా స్వీకరించినట్లు అంబిక చెప్పింది.

Advertisement

Next Story