స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఒక్కరూ ఆ పని చేయాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Satheesh |
స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఒక్కరూ ఆ పని చేయాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, గద్వాల: మోడీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో అగ్రగామి దేశంగా రూపుదిద్దుకొంటుందని కేంద్ర సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో ఏబీవీపీ రాష్ట్ర మహాసభ రెండవ రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏబీవీపీ సమాజ హితం, వికాసం కోసం పనిచేసే గొప్ప సంస్థ అని, ఏబీవీపీ సంస్థలో నేను కూడా విద్యార్థిగా పనిచేసిన అనుభవం ఉన్నదని ఆయన గుర్తు చేసుకున్నారు. వచ్చే 75 ఏండ్ల ఆజాద్ అమృత్ మహోత్సవాల సందర్భంగా స్వాత్రంత్ర్యం, స్వాతంత్ర్య అమరవీరుల త్యాగాల గురుంచి అందరూ తెలుసుకోవాలని, స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

దేశంలో పేదరికం, అసమానతలు, బుజ్జగింపు రాజకీయాలు పోవాలని ఆక్షేపించారు. ప్రపంచంలో పేరు పొందిన సంస్థలు భారత దేశం వారివే కావడం గర్వకారణమని కొనియాడారు. ఏబీవీపీ.. నూతన విద్యావిధానం, ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్ భారత్‌లో విలీనం కోసం గతంలో అనేక పోరాటాలు చేసిందన్నారు. బీజేపీ సిద్ధాంత కర్త శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నినాదం దేశంలో ఇద్దరు ప్రధానులు, రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు ఉండకూడదని కలలు కన్నాడో.. ఇప్పుడు మోడీ దానిని నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఈశాన్య రాష్ట్రాలు అశాంతితో ఉండేవని, రోజు ఏదో ఒక చోట ఉద్రిక్తతలు ఉండేవన్నారు. కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన పిదప ఈశాన్య రాష్ట్రాల్లో ప్రశాంత వాతావరణమే కాక.. ఆ రాష్ట్రాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాడని తెలిపారు.

నిరుద్యోగులను మోసం చేస్తున్న కేసీఆర్..

రాష్ట్రంలోని విద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని డీకే అరుణ అన్నారు. విద్యాలయాల్లో టీచింగ్ సిబ్బందిని నియమించకుండా ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేస్తుందన్నారు. కేసీఆర్ ఎన్నికల ముందు మళ్ళీ నిరుద్యోగులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఏబీవీపీ.. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తుంటే పోలీస్‌లు అరెస్ట్‌లు, అక్రమ కేసులు పెట్టి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు జిల్లా అధికారులు హరిత హోటల్ వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పోలీసులు గౌరవ వందనం చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష, ఆర్డీవో రాములు, ఎంఆర్ వో లక్ష్మీ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.

యువ పురస్కార్ అందజేత..

రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేసిన ఉదయ్ కుమార్ రెడ్డికి ఏబీవీపీ ఆధ్వర్యంలో గౌరిజి మెమోరియల్ యువ పురస్కార్ అవార్డ్‌ను, రూ.25వేల చెక్కును, మెమోంటో, ప్రశంసా పత్రాన్ని మంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణలు అందజేశారు. ఈయన 10 సంవత్సరాలుగా రోడ్ల మీద ఉండే అనాధలకు ఉచిత భోజనాలు అందించడం, అనాధ శవలకు దహన సంస్కారాలు చేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు ఈ అవార్డు ప్రధానం చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శంకర్, కార్యదర్శి ప్రవీణ్, ప్రాంత ప్రముఖ్ బాపురావు, ఇతర పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed