- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణపై కేంద్ర హోంశాఖ ఫోకస్.. హుటాహుటిన ఢిల్లీకి గవర్నర్
దిశ, తెలంగాణ బ్యూరో: రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య గ్యాప్ వ్యవహారం ఢిల్లీకి చేరుతున్నది. రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో కేంద్ర హోంశాఖ ఆరా తీస్తున్నది. నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోకస్ పెట్టారు. ఆయన పిలుపుతో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ హుటాహుటిన సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్ళారు. నార్త్ బ్లాక్‌లో మంగళవారం ఉదయం ఆయనతో గవర్నర్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన నివేదికను సమర్పించనున్నారు. సుదీర్ఘకాలం తర్వాత ఆమె ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో మకాం వేసి ఉన్న సమయంలోనే గవర్నర్ కూడా వెళ్లడం, కేంద్ర హోం మంత్రితో భేటీ కానుండడంపై రాజకీయ చర్చలు జోరందుకున్నాయి. గవర్నర్ తన నివేదికలో ఏయే అంశాలను ప్రస్తావిస్తారు, దాని తదుపరి కేంద్ర హోం శాఖ నుంచి ఎలాంటి యాక్షన్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది.. ఇవీ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
రాష్ట్రంలో గవర్నర్, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య తలెత్తిన విభేదాలు, భిన్నాభిప్రాయాలపై దృష్టి పెట్టిన కేంద్ర హోంశాఖ ప్రోటోకాల్ ఉల్లంఘనలతో పాటు రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో లోతుల్లోకి వెళ్ళాలనుకుంటున్నది. రాజకీయ అంశాలతో పాటు ఇటీవలి పరిణామాలన్నింటిపై వివరాలను సేకరించనున్నది. తాజాగా.. తెరమీదకు వచ్చిన పబ్‌లు, డ్రగ్స్ వ్యవహారంపైనా కేంద్ర హోంశాఖ సీరియస్‌గానే స్పందించింది. దీనిపైన కూడా గవర్నర్ నుంచి వివరాలను సేకరించనున్నది. ఇప్పటికే 2017 నాటి టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి సహా పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. ఐఏఎస్ అధికారి రజత్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలు సరేసరి. మొత్తంమీద రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనే అంశాలపై హోంశాఖ పూర్తి స్థాయిలో వివరాలను తెలుసుకోవడంపై దృష్టి పెట్టింది.
రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య గ్యాప్
కరోనా టైమ్‌లో రెండేళ్ల కింద నిమ్స్ ఆస్పత్రిని గవర్నర్ సందర్శించడంతో ప్రభుత్వంతో పెరిగిన గ్యాప్ ఇటీవల రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకలతో తారస్థాయికి చేరింది. కౌశిక్‌రెడ్డికి సోషల్ సర్వీస్ కేటగిరీలో ఎమ్మెల్సీ పదవి కోసం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపి పంపినా ఆ ఫైల్‌కు గవర్నర్ ఆమోదం తెలపలేదు. ఆయన చేసిన సోషల్ సర్వీస్ గురించి పరిశీలన జరుగుతున్నదని, ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కొంత సమయం పడుతుందంటూ స్వయంగా గవర్నర్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాతి నుంచి ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య గ్యాప్ కాస్త ఎక్కువైంది. చివరకు ఇది బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగం లేకుండా చేయడం మొదలు తాజాగా యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన గవర్నర్‌కు కనీసం ఎగ్జిక్యూటివ్ అధికారి స్వాగతం పలకకపోవడం వరకు దారితీసింది.
ఈ ఏడాది రాజ్‌భవన్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యమంత్రి గైర్హాజరయ్యారు. ఫిబ్రవరిలో మేడారంలో జరిగిన సమ్మక్క-సారలమ్మ జాతరకు గవర్నర్ హాజరైనా తగిన ప్రోటోకాల్ మర్యాదలు లభించలేదు. గత నెలలో నాగర్‌కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులోని చెంచు గ్రామాల పర్యటన సందర్భంగా అధికారులు అందుబాటులో లేరు. కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ తరఫున వరంగల్‌లో జరిగిన రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవానికి నగర మేయర్ సహా మంత్రులు, అధికారులు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకలేదు. యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఎగ్జిక్యూటివ్ అధికారి గైర్హాజరయ్యారు.
ప్రోటోకాల్ ప్రకారం జరిగిన ఉల్లంఘనలన్నింటిపైనా గవర్నర్‌ను ఈ సమావేశంలో హోం మంత్రికి వివరించే అవకాశం ఉన్నది. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకపోవడం, దానికి ప్రభుత్వం తరపున వచ్చిన వివరణపై కూడా ఈ సమావేశంలో గవర్నర్ వివరించే అవకాశం ఉన్నది. ఇద్దరూ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిణామాలు ఏ రూపం తీసుకుంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికినా ఆయన రాలేదంటూ స్వయంగా గవర్నరే వ్యాఖ్యానించారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నిమ్స్ ఆస్పత్రికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కరోనా టైమ్‌లో ఆస్పత్రిని సందర్శించినా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ప్రభుత్వాస్పత్రికి ప్రసవం కోసం వచ్చిన గర్భిణీకి అడ్మిషన్ దొరకకపోవడంతో రెడ్ క్రాస్ ద్వారా మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు గవర్నర్ చొరవ తీసుకున్నారు. ఈ అంశాన్ని ట్వీట్ ద్వారా కేంద్ర వైద్య మంత్రికి టాగ్ చేయడం ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించింది. రాష్ట్ర ప్రభుత్వంలోని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి బదులుగా రెడ్ క్రాస్‌కు అప్పగించడం, కేంద్ర మంత్రులకు తెలిసేలా ట్విట్టర్‌లో టాగ్ చేయడం అధికారులను అసహనానికి గురిచేసింది. అప్పటి నుంచి ప్రభుత్వంతో రాజ్‌భవన్‌కు గ్యాప్ పెరిగింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే గవర్నర్‌ను కేంద్ర హోం మంత్రి ఢిల్లీకి పిలిపించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అమిత్ షా తో భేటీ తర్వాత ప్రధానిని కలుస్తారా అనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఢిల్లీలో ఉన్న కేసీఆర్ వడ్ల కొనుగోళ్ళ అంశంలో ప్రధానిని కలవడానికి అపాయింట్‌మెంట్ కోరలేదని పీఎంఓ వర్గాల సమాచారం.