ఇక ఆర్టీసీని నడపడం కష్టమే.. భారీగా తగ్గుతున్న బస్సులు!

by GSrikanth |   ( Updated:2022-03-22 00:30:33.0  )
ఇక ఆర్టీసీని నడపడం కష్టమే.. భారీగా తగ్గుతున్న బస్సులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో:
2022, మార్చి, 10న అసెంబ్లీలో మంత్రి కేటీఆర్:

"ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి. అలాగే ఒక సంస్థను మూయాలంటే అది నష్టాల్లో ఉందని సృష్టించాలి. కేంద్రం కూడా అదే విధంగా చేస్తోంది. అట్లాగే ఏపీలోని విశాఖ స్టీల్‌ను నష్టాల్లోకి నెట్టిన కేంద్రం దాన్ని మూసివేస్తోంది. ఇక్కడ కూడా సింగరేణిపై అదే ప్లాన్​చేస్తోంది. నష్టాల్లోకి నెట్టితే మూసివేయడం తేలిక."

అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్​ చేసిన ప్రసంగం ఇది. ఒక సంస్థను ఎత్తివేయాలంటూ కోలుకోలని న(క)ష్టాల్లో ఉందని ముద్ర వేయాలి. దానికి వచ్చే ఆదాయ మార్గాల్ని కట్ చేస్తే అంతే. నష్టాల్లోకి పోయినట్టేనని మంత్రి కేటీఆర్​తెలిపిన సారంశం ఆర్టీసీలోనూ అమలవుతోంది. ప్రస్తుతం ఆర్టీసీ అష్టకష్టాల్లోకి వెళ్లింది. అప్పులు 6వేల కోట్లు దాటి పోయాయి. నష్టాలు ఆగడం లేదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు విడుదల చేయడం లేదు. ఇక ఆర్టీసీని ఆదుకుంటామంటూ బడ్జెట్‌లో నిధులు పెడుతున్నా.. వాటిని విడుదల చేయడంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాయితీలకు ఎంతో కొంత ఇచ్చి.. వాటిని బడ్జెట్ నిధుల్లోనే చూపిస్తోంది.

ఇచ్చేది తక్కువే

ఆర్టీసీకి ప్రతి ఏటా బడ్జెట్‌లో నిధులు పెడుతున్నా.. ఇచ్చేది మాత్రం తక్కువే ఉంటోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014–15లో మాత్రం కేటాయించిన రూ.100 కోట్లకు మొత్తంగా విడుదల చేశారు. ఇక 2015–16లో రూ.110 కోట్లకు రూ.102.50కోట్లు ఇవ్వగా, 2016–17లో రూ.110 కోట్లు పెట్టి రూ.27.5 కోట్లు రిలీజ్ చేసింది. ఆ తర్వాత కూడా అంతే. అయితే, 2019 నుంచి 2021 వరకు అంచనా బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండానే.. సవరణలో 2019–20లో రూ.850 కోట్లు, 2020–21లో రూ. వెయ్యి కోట్లు, 2021లో రూ.1,500 కోట్లు కేటాయించింది. గతేడాదిలో రూ. 1500 కోట్లు పెట్టినా రూ. 900 కోట్లు ఇచ్చింది. దీనిలో రాయితీల సొమ్మును కూడా ప్రభుత్వం లెక్కేసింది. రాయితీల కిందనే రూ. 600 కోట్ల వరకు ఇచ్చినట్లు పేర్కొంది.

ప్రమాదంలో బస్సు

2020 నాటికి 1400 బస్సులు కాల పరిమితి మీరిపోయాయి. గత ఏడాది డిసెంబర్​ నాటికి 643 బస్సులు స్క్రాప్​ అయినట్లుగా ఆర్టీసీ చైర్మన్​ బాజిరెడ్డి గోవర్ధన్​ అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ఆఖరునాటికి 823 బస్సుల కాల పరిమితి ముగిసిపోతోంది. మరోవైపు ఆర్టీసీకి రవాణా శాఖ నోటీసులు ఇస్తూనే ఉంది. కాల పరిమితి ముగిసి, ప్రమాదరకరంగా మారిన బస్సులను బయటకు తీయరాదని హెచ్చరిస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నాయి. రోడ్ల మధ్యలో ఆగిపోతున్నాయి. కాల పరిమితి మీరిన వాటికి ఇతర బస్సుల నుంచి కొన్ని స్పేర్​పార్ట్స్​వేసి రోడ్డుక్కిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 9075 బస్సులుండగా, వీటిలో అద్దె బస్సుల సంఖ్య 3,170కి చేరింది. సొంత బస్సులు 5886 అన్నట్టే. ప్రస్తుత నివేదిక ప్రకారం 2023 బస్సుల కాల పరిమితి మీరిపోయింది. అయినా వాటి విడి భాగాలను మార్చి నడుపుతున్నారు. దీంతో చాలా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఒక్కో బస్సులో పది బస్సుల విడి భాగాలను అమర్చుతున్నారు. దీంతో బస్సు నడుస్తుంటేనే చక్రాలు ఊడిపోతున్నాయి. మంటల్లో కాలిపోతున్నాయి.

దేనికైనా.. లాభమే సమాధానం

ఆర్టీసీని నాలుగు నెలల్లో లాభాల బాటలోకి తీసుకురాకుంటే ప్రైవేట్​పరం చేస్తామని సీఎం చెప్పినట్లు ఆర్టీసీ చైర్మన్​ బాజిరెడ్డి గోవర్ధన్​ గతంలోనే ప్రకటించారు. ఇటీవల అసెంబ్లీలో మంత్రి పువ్వాడ అజయ్​ మాట్లాడుతూ లాభాల్లోకి వస్తేనే కొత్త బస్సులు కొంటామని స్పష్టం చేశారు. మరోవైపు ఉద్యోగులకు రెండు పీఆర్సీలు పెండింగ్​లో ఉన్నాయి. డీఏలు ఆగిపోయాయి. ఇవన్నీ ఇవ్వాలంటే లాభాల్లోకి రావాల్సిందే. ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఆర్టీసీలో సొంత బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. వీటి స్థానంలో కొత్తవి కొనాలంటే కనీసం రూ. 2780 కోట్లు కావాలని ఆర్టీసీ అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అద్దె బస్సులను దింపారు. 2019 నుంచి 5100 రూట్లలో ప్రైవేటు ఆపరేటర్లకు పర్మిట్లు ఇచ్చారు. సంస్థ సొంత బస్సులు చాలా వరకు మూలన పడుతున్నా.. ఆ బస్సుల స్థానంలో అద్దె బస్సులను నడుపుతున్నారు. తాజాగా ఈ నెలాఖరుతో 500 కొత్త ఎలక్ట్రికల్​ బస్సులు రావాల్సి ఉంది. ఇందులో 20 వరకు డబుల్​ డెక్కర్​ బస్సులు కూడా ఉన్నాయి. ఇవి కూడా అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్నారు. గ్రేటర్​ పరిధిలోనే వీటిని నడుపనున్నారు. అంటే ఈ బస్సులు రాగానే.. జీహెచ్​ఎంసీ పరిధిలో ఆర్టీసీ సొంత బస్సులు షెడ్డులోకే.

ఆర్టీసీ లోటు రూ. 6846 కోట్లు

2020 నుంచి 2021 ఏప్రిల్ వరకు రూ.2,330 కోట్ల నష్టం వచ్చిందని, 2021 ఏప్రిల్​ నుంచి డిసెంబర్​ నాటికి రూ.1,440 కోట్ల నష్టం వాటిల్లిందని ఆర్టీసీ ఎఈండీ వీసీ సజ్జనార్​గతంలో వెల్లడించారు. ఈ లెక్కన ఆర్టీసీ సంస్థ మొత్తంగా రూ.6,846 కోట్ల లోటులో ఉన్నట్లు నివేదికల్లో ప్రభుత్వానికి వివరించారు. అటు రాయితీల కింద రూ. 2 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. 2020 నుంచి రాయితీ సొమ్ము ఇవ్వడం లేదు. దీంతో సర్కారు బాకీ రూ. 2వేల కోట్లకు చేరింది. గత ఏడాది మాత్రం రూ. 600 కోట్లు ఇచ్చారు. ఇంకా ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకుల నుంచి ఆర్టీసీ రూ. 2279 కోట్ల అప్పు తీసుకుంది. ఇది కాకుండా ఆర్టీసీ సొంతంగా తీసుకున్న అప్పు రూ. 2421 కోట్లు. ప్రస్తుతం ఆర్టీసీపై మొత్తం అప్పు రూ.4700 కోట్లకు చేరింది. ఈ అప్పుపై ఆర్టీసీ ఏటా రూ. 210 కోట్ల వడ్డీ చెల్లిస్తోంది. ఇవి కాకుండా ఉద్యోగుల సీసీఎస్, డీఏలు, రిటైర్మెంట్​బెనిఫిట్స్‌కు ఇంకా రూ. 900 కోట్లు. గత ఏడాదిలో రూ. 1246 కోట్ల నష్టం వచ్చింది. ఈ లెక్కల ప్రకారం ఆర్టీసీ మొత్తంగా రూ.6,846 కోట్ల లోటుతో నడుస్తోంది.

భయాన్ని చూపిస్తూ వీఆర్ఎస్

ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులను వీఆర్ఎస్ వైపు తీసుకెళ్తున్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉందని, మూసివేస్తే కనీసం రూపాయి కూడా రాదని భయపెడుతున్నారు. అందుకే వీఆర్ఎస్‌కు ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి డిపోలో ఒక రిజిస్టరు ఏర్పాటు చేసి ఆసక్తి చూపే వారి వివరాలను నమోదు చేయిస్తున్నారు. అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయకుండా క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. అటు బస్సుల సంఖ్యను భారీగా తగ్గించడంతో సిబ్బంది విధుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్టీసీలో వివిధ స్థాయుల్లో ప్రస్తుతం 47,528 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 20 వేల మందిని ఇంటికి పంపించేందుకు నష్టాలను సాకుగా చూపిస్తున్నారు.





Advertisement

Next Story

Most Viewed