Telangana News: వాగ్ధానం మరిచిన టీఆర్ఎస్.. మేనిఫెస్టో హామీలు గాలికి

by Nagaya |   ( Updated:2022-04-11 05:28:45.0  )
Telangana News: వాగ్ధానం మరిచిన టీఆర్ఎస్.. మేనిఫెస్టో హామీలు గాలికి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజా సంక్షేమం తప్ప మరేదీ ప్రాధాన్యం కాదని టీఆర్ఎస్ చాలా గొప్పగా చెప్పుకుంటున్నా ఆచరణ మాత్రం దానికి భిన్నంగానే ఉంటున్నది. మాటలకు, చేతలకు పొంతన లేకుండాపోయింది. అధికారంలోకి రావడానికి 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ అనేక వాగ్ధానాలు చేసింది. కానీ అందులో కొన్ని ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. ప్రతీ మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రిని కొత్తగా నిర్మించనున్నట్లు హామీ ఇచ్చింది. కానీ ఈ ఏడాది జనవరి చివరి నాటికి ఒక్క మండలంలో కూడా అలాంటి ఆస్పత్రులను కొత్తగా నిర్మించలేదు. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఒక్కటి కూడా ఈ ఎనిమిదేళ్ళ కాలంలో నిర్మించలేదని స్వయంగా ఆ విభాగం కమిషనర్ కార్యాలయం లిఖితపూర్వకంగా స్పష్టం చేసింది.

ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రులను కొత్తగా నిర్మిస్తామని అదే మేనిఫెస్టోలో టీఆర్ఎస్ వాగ్ధానం చేసింది. కానీ కేవలం ఇరవై నియోజకవర్గాల్లో మాత్రమే నెలకొల్పినట్లు వైద్య విధాన పరిషత్ కమిషనర్ కార్యాలయం వివరణ ఇచ్చింది. ఇందుకోసం ఈ ఎనిమిదేళ్ళ కాలంలో రూ. 484 కోట్లను కేటాయించింది. ఎంత ఖర్చుచేసిందీ, ఇంకా ఎంత చేయాల్సి ఉన్నదీ అటు ఆర్థికశాఖ, ఇటు వైద్యారోగ్య శాఖ వివరాలను వెల్లడించడానికి సుముఖంగా లేవు. తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ ఆస్పత్రుల నిర్మాణం జరిగింది.

వైద్య విధాన పరిషత్ ఇచ్చిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లాలో మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో రూ. 34 లక్షల చొప్పున ఖర్చు చేసి వీటిని నిర్మించింది. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో రూ. 32 కోట్లు, కామారెడ్డి పట్టణంలో రూ. 21 కోట్లు, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో మాతాశిశు ఆస్పత్రిని రూ. 31 కోట్లు, ఇదే నియోజకవర్గంలో ఏరియా ఆస్పత్రికి రూ. 21 కోట్లు, ఇదే జిల్లా దుబ్బాటలో రూ. 21 కోట్లతో మరో ఏరియా ఆస్పత్రిని నిర్మించినట్లు వెల్లడైంది. మహబూబ్‌‌నగర్ జిల్లా జడ్చర్లలోరూ. 22 కోట్లు, నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, కొల్లపూర్ నియోజకవర్గాల్లో రూ. 22 కోట్ల చొప్పున రెండు ఆస్పత్రులు, గద్వాల జిల్లా ఆలంపూర్‌లో రూ. 23 కోట్లతో మరో ఆస్పత్రిని నిర్మించినట్లు పేర్కొన్నది.

సిరిసిల్ల జిల్లా వేములవాడలో రూ. 22 కోట్లు, జగిత్యాల జిల్లా కోరుట్లలో రూ. 21 కోట్లు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రూ. 17 కోట్లు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రూ. 20 కోట్లు, భూపాలపల్లి కేంద్రంలో రూ. 26 కోట్లు, షాద్‌నగర్‌లో రూ. 20 కోట్లతో రాష్ట్రం మొత్తంమీద 100 పడకలతో 20 కొత్త ఆస్పత్రులను వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నిర్మించినట్లు వెల్లడైంది. టీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకారం మొత్తం 119 నియోజకవర్గాల్లో ఏర్పాటు కావాల్సి ఉన్నా కేవలం 20 చోట్ల మాత్రమే లక్ష్యం పూర్తయింది.

రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలుకలు కొరికి పేషెంట్లు చనిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తగిన వైద్య సేవలు అందకపోవడంతో చాలా మంది జిల్లా కేంద్రాలు, హైదరాబాద్ బాట పడుతున్నారు. నగరంలోని మెటర్నిటీ ఆస్పత్రికి రోజూ పదుల సంఖ్యలో ఇతర జిల్లాల నుంచి గర్భిణీలు వస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో, జిల్లా ఆస్పత్రుల్లో తగిన సౌకర్యాలు లేకపోవడంతో హైదరాబాద్‌కు రావడం అనివార్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 11,237 కోట్లను వైద్య రంగానికి కేటాయించింది. కానీ ఎనిమిదేళ్ళ క్రితం ఇచ్చిన హామీల అమలుపై మాత్రం చిత్తశుద్ధి చూపలేదు.

కరోనా లాంటి తీవ్రమైన సంక్షోభాన్ని చవిచూసినా వైద్య రంగానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులను అవసరమైన మేరకు కేటాయించలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెల 1వ తేదీన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. రాష్ట్ర బడ్జెట్‌లో గతేడాదికంటే నిధుల కేటాయింపును పెంచింది. కానీ గ్రామీణ వైద్యారోగ్య వ్యవస్థ మాత్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేకపోయింది. తెలంగాణ ఏర్పడే నాటికి పది జిల్లాలు మాత్రమే ఉన్నా 24 జిల్లాలుగా మారుతుందన్న ఉద్దేశంతో ప్రతీ జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించనున్నట్లు టీఆర్ఎస్ 2014 మేనిఫెస్టోలోనే హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ ఆ టాస్క్ పూర్తికాలేదు. ఘనమైన హామీలు ఇచ్చినా అందుకు తగిన ఆచరణ మాత్రం కొరవడింది.

Advertisement

Next Story