గ్రూపు గొడవలతో వీదినపడుతున్నా గులాబీ.. మౌనంగా సీనియర్ నాయకులు

by Manoj |
గ్రూపు గొడవలతో వీదినపడుతున్నా గులాబీ.. మౌనంగా సీనియర్ నాయకులు
X

దిశ, భద్రాచలం : చర్ల టౌన్ అధ్యక్ష పదవి కోసం కారులో రగిలిన చిచ్చు ఆరడంలేదు. కొద్దిరోజులు గ్రూపు గొడవలు సద్దుమణిగినట్లు కనిపించినా సందర్భాన్ని బట్టి మళ్ళీ సడన్‌గా తెరపైకి వస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శి వర్గాల నడుమ తలెత్తిన ఆధిపత్య ధోరణి కారును డామేజ్ చేస్తోంది.‌ ప్రధానమైన చర్ల టౌన్ అధ్యక్ష పదవి తమ వర్గానికే దక్కిందని రెండు వర్గాల వారు చెప్పుకుంటున్నారు.

చర్ల టౌన్ అధ్యక్షుడిగా ముమ్మినేని సత్యసంపన్‌ పేరు ఖరారైనట్లు పార్టీ మండల కార్యదర్శి నక్కినబోయిన శ్రీనివాసయాదవ్ ప్రచారం చేస్తుండగా.. మండల అధ్యక్షుడు సోయం రాజారావు వర్గం టౌన్ అధ్యక్షుడిగా ఇరసవడ్ల రాము పేరు ప్రచారం చేస్తున్నారు. రెండు గ్రూపుల నడుమ సాగే ఈ వాట్సప్ వార్‌కు చెక్‌పెట్టి అసలు అధ్యక్షుడు ఎవరో తేల్చిచెప్పాల్సిన పార్టీ డివిజన్, జిల్లా పెద్దలు మౌనంగా ఉంటున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీకి చర్లలో ఇద్దరు అధ్యక్షులని ఇతర పార్టీల వారు హేళన చేస్తున్నారు. ఈ గ్రూపు గొడవలు చర్లలో పార్టీని పతనావస్థకు చేరుస్తున్నాయనే అభిప్రాయం గులాబీ శ్రేణుల్లో వినిపిస్తోంది. గొడవలతో పార్టీ వీదినపడుతున్నా పై నాయకులు పట్టించుకునే పరిస్థితి లేదు. లోకల్ లీడర్ల మూలంగా చర్లలో గులాబీ కార్యకర్తల పరిస్థితి కరవమంటే కప్పకు, వదలమంటే పాముకు కోపం అన్నట్లుగా తయారైంది.

ఒకే పార్టీ కదా అని ఓ లీడర్‌తో మాట్లాడితే.. అది మరో లీడర్ చూసి అపార్థం చేసుకుంటున్నారని చర్ల నాయకుల తీరు పట్ల క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పార్టీ కార్యక్రమాలకు కానీ, ఆఫీసుకు గానీ వెళ్ళాలంటే భయపడుతున్నామని టీఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులు చెప్పడం చర్లలో నాయకుల నడుమ ఆధిపత్య గొడవలను తేటతెల్లంచేస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో పంతాలు, పట్టింపులకుపోయి ఎంపీపీ, జడ్పీటీసీలను చేజార్చుకున్నప్పటికీ నాయకులకు గుణపాఠం కలగడంలేదనేది కార్యకర్తల అభిప్రాయం. జరిగిన తప్పులను సరిచేసుకోవాల్సిన నాయకులు తాము కరెక్టు, ఇతరులదే తప్పు అని ఒకరిపై మరొకరు నిందలు వేస్తూ గ్రూపులు పెంచిపోషిస్తున్నారు. ఈ గ్రూపులు ఇలాగే కొనసాగినంతకాలం చర్లలో టీఆర్ఎస్ పార్టీ బాగుపడదని గులాబీ శ్రేణులు మదనపడుతున్నారు. ఈ నేపథ్యంలో చర్లలో గొడవలపై టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు దృష్టిపెట్టి, సర్దుబాటు చేయాలని గులాబీ శ్రేణులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed