రాహుల్ గాంధీపై కేసీఆర్ సానుకూల వ్యాఖ్యలు.. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ పొత్తుపై రేవంత్ క్లారిటీ

by GSrikanth |
రాహుల్ గాంధీపై కేసీఆర్ సానుకూల వ్యాఖ్యలు.. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ పొత్తుపై రేవంత్ క్లారిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరి ధాన్యం కొనుగోళ్ళ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయని ఆరోపించిన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలను టేకప్ చేసి ఎన్నికల వరకూ దీర్ఘకాలిక పోరాటాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సుమారు 40 లక్షలకు పైగా డిజిటల్ సభ్యత్వ నమోదు పూర్తయిన నేపథ్యంలో ఒక్కో మెంబర్‌కు రెండు లక్షల రూపాయల మేర బీమా సౌకర్యాన్ని కల్పించిన చెక్కును రాహుల్‌గాంధీకి ఢిల్లీలోని ఆయన నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు బుధవారం అందజేశారు. వడ్ల కొనుగోళ్ళతో పాటు అనేక అంశాలపై పోరాడాలంటూ రాహుల్ గాంధీ దిశా నిర్దేశం చేశారని రేవంత్ వివరించారు. రాష్ట్రంలో పర్యటించాల్సిందిగా రాహుల్‌గాంధీని కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.

రాహుల్‌గాంధీతో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్ళ అంశంతో పాటు ఉద్యమకారుల కుటుంబాలు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటిన్నింటిపై కాంగ్రెస్ అలుపెరుగని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొదలయ్యే ఈ ఉద్యమం ఎన్నికల వరకూ దీర్ఘకాలిక వ్యూహంతో జరుగుతుందన్నారు. ఇప్పటిదాకా సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టామని, ఇకపైన తమ పార్టీ ఫోకస్ ప్రజా పోరాటాలపైనే ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల డిజిటల్ సభ్యత్వ నమోదులో నల్లగొండ, పెద్దపల్లి జిల్లాలు ఫస్ట్, సెకండ్ ప్లేస్‌లలో ఉన్నాయని తెలిపారు. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు రెండు లక్షల బీమా సౌకర్యం కలుగుతున్నదని తెలిపారు.

గెలుపు ఖాయమైతే పీకే అవసరమేంటి?

రానున్న ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తామని ధీమాగా చెప్తున్న కేసీఆర్‌కు ఇప్పుడు వ్యూహకర్త పీకే అవసరం ఎందుకని రేవంత్ ప్రశ్నించారు. గెలుపే ఖాయమైతే ఆయన సహకారం ఎందుకు కావాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మరోవైపు రాహుల్‌గాంధీపై సానుకూల కామెంట్లు చేస్తూ కాంగ్రెస్‌తో స్నేహం ఉన్నట్లుగా కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎక్కడ గెలుస్తుందనుకుంటే అక్కడ మజ్లిస్ పార్టీ, కేసీఆర్ వేలు పెడతారని, బీజేపీ చెప్పుచేతల్లో వారిద్దరూ నడుస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ గురించి ఎప్పుడో తెలుసని, ఆయన చేసిన మోసాన్ని పార్టీ నాయకత్వం మర్చిపోలేదన్నారు. అలాంటి వ్యక్తితో, పార్టీతో కాంగ్రెస్ ఏ రూపంలోనూ సహకారం, స్నేహంలో ఉండదన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయిందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీనే సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని రేవంత్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఏప్రిల్ 4న సీనియర్లతో రాహుల్ భేటీ

ఏఐసీసీ నేత రాహుల్‌తో రేవంత్ సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీలోని అంతర్గత అంశాలపైనా రాహుల్‌గాంధీ ఆరా తీశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఇప్పటి నుంచే కాంగ్రెస్ సీరియస్ పోరాటాలు చేయాల్సిందిగా వారికి దిశా నిర్దేశం చేశారు. పార్టీలోని అంతర్గత సమస్యలు, వివాదాలు, ఘర్షణలపై ఏప్రిల్ 4న 22 మంది సీనియర్లతో సమావేశం కానున్నట్లు తెలిపారు. పార్టీకి సంబంధించిన సంస్థాగత అంశాలు, బలోపేతం చేయడం, అంతర్గత సమస్యలను పరిష్కరించడంపై ఆ సమావేశంలో సీనియర్లతో చర్చించనున్నట్లు వివరించారు. రాహుల్‌గాంధీతో బుధవారం జరిగిన సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ, బలరాంనాయక్, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, దామోదర రాజ నర్సింహ, అజారుద్దీన్, మహేశ్వర్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు కూడా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed