ఫారెస్ట్ అధికారులపై దాడి.. తీవ్ర గాయాలతో..

by Vinod kumar |
ఫారెస్ట్ అధికారులపై దాడి.. తీవ్ర గాయాలతో..
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్/ లింగాల: నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఇంకిళ్ల పెంట గ్రామ శివారు అడవులలో ఇద్దరు అటవీ శాఖ అధికారులపై ఎనమిది వ్యక్తులు దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాల మండలానికి చెందిన సత్పతి శంకర్, సత్పతి మాసయ్య, బండారి వెంకటయ్య, గడ్డి ఖాసీం, సోనా మోని మల్లయ్య, కారుకొండ శీను, కారుకొండ ఆంజనేయులు అనే వ్యక్తులు అడవిలో నుండి వెదురు బొంగులు తీసుకొస్తున్నట్లు గుర్తించిన అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ వెంకటేష్, బీట్ ఆఫీసర్ శివాజీ వారిని బుధవారం సాయంత్రం అడ్డుకుని కలపను ఫారెస్ట్ కార్యాలయానికి తరలించాలని ఆదేశించారు.


ఈ విషయంపై అధికారులు, కలప తరలిస్తున్న వారి మధ్య మాట మాట పెరిగి ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఈ సంఘటనలో ఫారెస్ట్ అధికారులు ఇరువురికి గాయాలు అయ్యాయి. ఒకరికి కన్ను వద్ద తీవ్ర గాయం కాగా, మరొకరికి చేతి విరిగింది. ఈ మేరకు ఫారెస్ట్ అధికారులు లింగాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా తమపై దాడులు చేయడం వల్లే ప్రతి దాడి చేశామని కలపను తరలిస్తున్న వారు పేర్కొంటున్నారు. తమపై దాడికి పాల్పడిన ఫారెస్ట్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed