- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ వ్యూహం ఇదే.. నిరుద్యోగ భృతికి బ్రేక్!?
దిశ, తెలంగాణ బ్యూరో :
" 2018, జనవరి 28.
రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంత మంది ఉంటే అందరికీ నిరుద్యోగ భృతి అందిస్తాం. దీనికోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తాం. డిగ్రీలు పూర్తి అయిన వారిని నిరుద్యోగులుగా గుర్తించి, భృతి ఇస్తాం. "
2019, ఫిబ్రవరి 23
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్. ఈ బడ్జెట్లో నిరుద్యోగ భృతి కోసం రూ. 1810 కోట్లు కేటాయించారు.
" 2021, మార్చి 26
ఈ బడ్జెట్ సమావేశాల్లో నిరుద్యోగ భృతిపై క్లారిటీ ఇస్తున్న. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితుల కారణంగానే నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం కచ్చితంగా నిరుద్యోగ భృతి ఇచ్చి తీరుతాం. ఇతర రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతిపై అధ్యయనం చేస్తున్నాం. కరోనా వల్ల తెలంగాణకు లక్ష కోట్లకుపైగా నష్టం వచ్చింది. అయినా తట్టుకుని నిలబడినట్లు పేర్కొన్నారు. అప్పులు చెల్లించడంతో ఎప్పుడూ డిఫాల్డ్ కాలేదు. కరోనా ఎఫెక్ట్‌ను తట్టుకుని ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం."
రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇచ్చే భృతిపై సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా పలుమార్లు ప్రకటన చేశారు. కానీ, దీనిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అసలు దీనిపై మార్గదర్శకాలు కూడా రెడీ చేయలేదు. ఎంతమందికి ఇవ్వాలి, దేనిని ప్రామాణికంగా తీసుకోవాలనే నిబంధనలను కూడా తయారు చేయలేదు. తాజాగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేశారు. దీంతో నిరుద్యోగులకు భృతి లేనట్టేనని రూఢీ అవుతోంది.
45 లక్షల మంది నిరుద్యోగులు
రాష్ట్ర టీఎస్పీఎస్సీలో 2018 నాటికే వన్ టైం రిజిస్ట్రేషన్ ద్వారా రిజిస్టర్ అయిన నిరుద్యోగులు 24.60 లక్షల మంది ఉన్నారు. వీరంతా 2018 నాటికే డిగ్రీలు పూర్తి చేశారు. దీనికితోడుగా తెలంగాణ ఉపాధి కల్పనా సంస్థ (ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్)లో 11.20 లక్షల మంది నమోదై ఉన్నారు. వీరిలో కొంతమందికి ప్రైవేట్ ఉద్యోగావకాశాలు కల్పించినా ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి అమలు చేస్తామని 2018లో ప్రకటించిన కేసీఆర్ సర్కారు ఈ హామీని నెరవేర్చడం లేదు.
అప్పుడు.. ఇప్పుడూ ఆశల్లో
ముందుగా నిరుద్యోగుల లెక్క తేలిన తర్వాతే నిరుద్యోగ భృతి అందిస్తారంటూ ప్రభుత్వ వర్గాల నుంచి చెప్పుతూ వచ్చారు. ఉప ఎన్నికల సమయాల్లో ఇది బాగానే ప్రచారానికి వచ్చింది. మండలి ఎన్నికలు, దుబ్బాక, నాగార్జున సాగర్, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ దీనిపై పలుమార్లు ప్రకటన చేస్తూనే వచ్చారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఇక భృతి రావడమే అన్నట్టుగా చెప్పారు.
మరోవైపు రాష్ట్రంలో 23 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు పలు సర్వేల్లో కూడా తేలింది. ప్రభుత్వం సేకరించిన వివరాలతో పాటుగా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సంస్థలు నిర్వహించిన సర్వేలో నిరుద్యోగుల లెక్కలు వెల్లడయ్యాయి. వీరిలో 76 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగాల వేటలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వం సేకరించిన లెక్కల ప్రకారమే కనీసం 23 లక్షల మంది నిరుద్యోగులకైనా నిరుద్యోగ భృతిని చెల్లించాల్సి ఉంటుంది.
దీనిపై ఆర్థిక శాఖ లెక్కలు కూడా వేసింది. డిగ్రీలు చదివిన వారిని, అందులోనూ 35 నుంచి 44 ఏండ్లలోపు వారిని అర్హులుగా తీసుకుంటే అటు టీఎస్పీఎస్సీ, ఇటు ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ లో కలుపుకుని కనీసం 23 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంటుందని, దీంతో రూ. 693.68 కోట్లు ప్రతినెలా అవసరమని నివేదికను కూడా సిద్ధం చేశారు. దీనిలో భాగంగానే 2019 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముందుగా రూ. 1810 కోట్లు కేటాయించారు. కానీ, దీనిపై ఎలాంటి ఉత్తర్వులు, ఆదేశాలు రాలేదు. సీఎం నుంచి ఆమోదం రాకపోవడంతో భృతి అంశం పెండింగ్ పడింది.
ఇప్పుడు కష్టమే
ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేశారు. దీంతో నిరుద్యోగులు ప్రస్తుతం ఉద్యోగాల నోటిఫికేషన్లపైనే ఉంటారు. ఈ ప్రక్రియ దాదాపుగా రెండేండ్ల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఒక్కో డిపార్ట్మెంట్ వారీగా నోటిఫికేషన్లు జారీ కానుండటం, టెస్టులు, ఇంటర్వ్యూలు తేదీలను విడుతలుగా మార్చాల్సి రావడంతో భర్తీ ప్రక్రియ చాలా సమయం తీసుకోనుంది. నోటిఫికేషన్లు ఇచ్చామనే కారణంతో ఇక నిరుద్యోగ భృతి రాదన్నట్టే. ప్రస్తుతానికి భృతి అంశంలో కేసీఆర్కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో భృతి అంశం నుంచి ప్రభుత్వం కూడా తప్పించుకున్నట్టే.