- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడున్నరేండ్లుగా తెలంగాణలో తిష్ట.. 61 మంది డాక్టర్లకు హైకోర్టు షాక్!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినా తెలంగాణలోనే తిష్ట వేసుకుని కూర్చున్న డాక్టర్లకు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. చట్టబద్ధంగానే కేటాయింపు ప్రక్రియ జరిగినందున తెలంగాణలో పనిచేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కేటాయింపుకు తగినట్లుగా ఏపీకి వెళ్ళాల్సిందేనని తేల్చి చెప్పింది. తెలంగాణలోనే కొనసాగేలా వెసులుబాటు కల్పించాలంటూ దాఖలు చేసిన రిట్ పిటిషన్లను కొట్టివేసింది. దాదాపు ఎనిమిదేళ్ళుగా తెలంగాణలోనే పనిచేస్తున్న 61 మంది డాక్టర్లు హైకోర్టు తీర్పుతో సర్దుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది. తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (డీఎంఈ) కార్యాలయం కూడా ఈ డాక్టర్లకు రిలీవ్ ఆర్డర్లను జారీ చేస్తున్నది. హైకోర్టును ఆశ్రయించిన మరికొద్దిమంది డాక్టర్లకు కూడా త్వరలో ఇదే తరహా ఉత్తర్వులు వెలువడతాయన్న గుబులు పట్టుకున్నది.
హైకోర్టు తీర్పు వెలువడడంతోనే డీఎంఈ కార్యాలయం కూడా అన్ని బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లకు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్ళకు సర్క్యూలర్ జారీ చేసింది. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన డాక్టర్లను వెంటనే ఏపీకి వెళ్ళిపోయాలే తక్షణం రిలీవ్ ఆర్డర్లను జారీ చేయాలని ఆదేశించింది. హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్ తదితర జిల్లాలకు ఈ సర్క్యూలర్ జారీ అయింది. హైదరాబాద్‌లో ఉస్మానియా, గాంధీ, మెటర్నిటీ, ఎంఎన్‌జే క్యాన్సర్, పేట్లబురుజు తదితర ఆస్పత్రుల్లో, మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతం పనిచేస్తున్నవారిని గుర్తించి రిలీవ్ ఆర్డర్లను ఇవ్వాలని కొద్దిమంది పేర్లను ఆ సర్క్యూలర్‌లో ఉదహరించింది. దాదాపు ఐదేళ్ళుగా హైకోర్టులో జరుగుతున్న పిటిషన్ల విచారణకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నేతృత్వంలోని బెంచ్ ఇటీవల తీర్పు ఇచ్చింది.
తెలంగాణ ఏర్పాటుతో సమైక్య రాష్ట్రంలో పనిచేసిన సివిల్ అసిస్టెంట్ సర్జన్లు సహా వివిధ హోదాల్లో ఉన్న డాక్టర్లను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం తెలంగాణ సాధారణ పరిపాలనా శాఖ (జీఏడీ) 2014 అక్టోబరులో కేటాయింపు ఉత్తర్వులను జారీచేసింది. పదో తరగతి వరకు చదువుకున్న ప్రాంతాన్ని స్థానికతగా గుర్తించడంతో పాటు సీనియారిటీని కూడా పరిగణనలోకి తీసుకున్నది. ఈ ప్రకారం కొద్దిమంది డాక్టర్లను ఏపీకి కేటాయించింది. అయితే దీన్ని సవాలు చేస్తూ డాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. తాము చదువుకున్నది ఆంధ్రప్రదేశ్‌లోనే అయినా కేటాయింపు ప్రక్రియ సమయంలో ఆప్షన్లను అడిగినందున తెలంగాణలో పనిచేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు డాక్టర్లు పేర్కొన్నారు.
తొలుత ప్రొవిజనల్ (టెంటేటివ్) కేటాయింపులను సవాలు చేస్తూ హైకోర్టులో డాక్టర్లు వేర్వేరుగా పిటిషన్లను దాఖలు చేశారు. విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానికత కలిగినప్పటికీ స్టేట్ లెవల్ కేడర్ పోస్టులు, సీనియారిటీకి విరుద్ధంగా ఏపీకి కేటాయింపులు జరిగాయని, ఆప్షన్లను అడిగిన తర్వాత వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16, 21కి విరుద్ధమని పిటిషన్లలో పేర్కొన్నారు. స్థానికతకు పరిగణనలోకి తీసుకున్న నిర్వచనం రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్నదానికి భిన్నమైనదని పేర్కొన్నారు. తెలంగాణకు ఆప్షన్ ఇచ్చుకున్నా ఏపీకి కేటాయించడం ఏకపక్ష నిర్ణయమని, వీటిని కొట్టివేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది ఈ ప్రక్రియపై క్లారిటీ ఇస్తూ, సమైక్య రాష్ట్రంలో జోన్-3 ప్రకారం వీరు ఏపీ స్థానికత కలిగినవారని, అందువల్లనే ఆ రాష్ట్రానికి కేటాయించాల్సి వచ్చిందని, ఈ ప్రక్రియలో విభజన చట్టంలోని నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించామని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మార్గదర్శకాల మేరకే డాక్టర్ల కేటాయింపు ప్రక్రియ జరిగిందన్నారు. రాష్ట్రస్థాయి కేడర్‌గా ఉన్నందున 2015లో జారీ చేసిన వేర్వేరు నోటిఫికేషన్లకు అనుగుణంగా ఆన్‌లైన్ ద్వారా డాక్టర్లు వారి ఆప్షన్లను సమర్పినంచారని, అందులో వారంతా 'నాన్-లోకల్' అని స్పష్టంగా పేర్కొన్నారని వివరించారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ సైతం వీరి స్థానికతను ఆ రాష్ట్రానికి చెందినదిగానే గుర్తించిందని, వారు సమర్పించిన ఫామ్-3లో పేర్కొన్న విద్యా వివరాలకు అనుగుణంగానే సమైక్య రాష్ట్రంలో వీరి రిక్రూట్‌మెంట్ జోన్-3లోకి వెళ్ళిందని పేర్కొన్నారు. ఆ ప్రకారమే వారి సీనియారిటీని కూడా లెక్కించిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల్లోని 8, 9 ప్రకారం వారి కేటాయింపును ఖరారు చేసినట్లు తెలిపారు.
ఇరువైపు వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సీజే బెంచ్ మొత్తం 61 మంది డాక్టర్ల పిటిషన్లపై విచారణ ముగిసిందని పేర్కొని కేటాయింపు ప్రక్రియ సమంజసంగానే జరిగిందని, నిబంధనల ఉల్లంఘన జరగలేదని, తెలంగాణలో పనిచేయడానికి అవకాశం లేదని, కేటాయింపు ప్రకారం ఏపీకి వెళ్ళిపోవాల్సిందేనని స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధంగా రూపొందించిన కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల్లోనూ, 1975 నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్‌మెంట్ చట్టంలో స్థానికతకు ఇచ్చిన నిర్వచనంలోనూ కేటాయింపు సందర్భంగా ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల వాదనను తిరస్కరించి కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పిటిషన్లు దాఖలు చేసిన 61 మంది డాక్టర్లు ప్రస్తుతం తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ సర్వీసులో చేరక తప్పడంలేదు. ప్రస్తుతం హైకోర్టులో విచారణ దశలో ఉన్న మరికొద్దిమంది పిటిషన్లపై కూడా ఇదే తరహా తీర్పు వస్తుందనే గుబులు మొదలైంది.
భవిష్యత్తులో ఇదే తీర్పు ఐఏఎస్ అధికారుల కేటాయింపునకూ వర్తించే అవకాశం లేకపోలేదన్న చర్చలు సచివాలయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. ఏపీకి కేటాయింపు జరిగినప్పటికీ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ స్టే ఉత్తర్వులతో తెలంగాణలోనే కొనసాగుతున్న ఐఏఎస్ అధికారులపై త్వరలో ఎలాంటి తీర్పును హైకోర్టు వెలువరిస్తుందోననే ఆసక్తి నెలకొన్నది.