తల్లి చెంతకు తమన్నా.. కిడ్నాప్ మిస్టరీని చేధించిన పోలీసులు

by Mahesh |
తల్లి చెంతకు తమన్నా.. కిడ్నాప్ మిస్టరీని చేధించిన పోలీసులు
X

దిశ, కంది : ఈ నెల 4వ తేదీన అర్ధరాత్రి సంగారెడ్డి లో కొండాపూర్ మండలం అలియాబాద్ గ్రామానికి చెందిన సఖీన బేగం రెండో కూతురు తమన్నాను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేవలం 48 గంటల్లో నిందితులైన భార్య భర్తలు ఇద్దరిని పట్టుకొని కేసును ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

చిన్నారిని చూపి మరింత సంపాదించాలని..

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని జంగంపల్లి లో నివాసముంటున్న సయ్యద్ సలీం అలియాస్ సయ్యద్ హుస్సేన్ (35), అతని భార్య గౌసియా బేగంలు స్థానికంగా ఫకీరుగా భిక్షాటన చేస్తూ ఉంటున్నారు. అయితే వీరిద్దరూ ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో ఉంటూ పరిసర ప్రాంతంలో భిక్షాటన చేస్తూ తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే సంగారెడ్డిలో భిక్షాటన చేస్తూ ఉండగా సఖీన బేగం తన ఇద్దరు కూతుళ్లతో కలిసి సంగారెడ్డి మసీదు వద్ద భిక్షాటన చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తున్న విషయాన్ని వీరిద్దరు గమనించారు.

ఎలాగైనా సఖీన రెండో కూతురు అయిన తమన్నాను ఎత్తుకెళ్లి వేరే ఊర్లో ఆ చిన్నారిని చూపి భిక్షాటన చేస్తే మరిన్ని డబ్బులు సంపాదించవచ్చు అని ఇద్దరు కలిసి ఈ నెల 4న రాత్రి కిడ్నాప్ చేశారు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సంగారెడ్డి పట్టణ పోలీసులు కేవలం 48 గంటల్లో నిందితులను సాంకేతిక ఆధారాలతో వారిని బోధన్ లో బుధవారం నాడు పట్టుకున్నారు.

చిన్నారిని తల్లి కి అప్పగించిన డీఎస్పీ బాలాజీ

కిడ్నాప్‌కు గురైన సఖీన బేగం రెండో కూతురు తమన్నాను సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ చిన్నారిని ఆమె తల్లి కి అప్పగించారు. కిడ్నాప్‌కు గురైన తన చిన్నారి పోయిందని బాధతో ఉన్న ఆ తల్లి చిన్నారిని చూడగానే ఒక్కసారిగా సంతోషంతో ఉబ్బితబ్బి పోయింది. ఇంకోసారి ఇలా అజాగ్రత్తగా ఉండకుండా కూతురులు ఇద్దరిని బాగా చూసుకోవాలని డీఎస్పీ ఈ సందర్భంగా ఆమెకు సూచించారు.

ఈ కేసును కేవలం 48 గంటల్లో మూడు బృందాలుగా మారి చేదించడం లో కీలకంగా వ్యవహరించిన సంగారెడ్డి పట్టణ సీఐ బి.రమేష్, ఎస్సై కోటేశ్వరరావు, ఏఎస్సై శ్రీనివాస్ రెడ్డి బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వీరికి రివార్డు కోసం జిల్లా ఎస్పీకి సిఫార్సు చేయడం జరుగుతుందని డిఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కానిస్టేబుల్ షాకీర్ ఉద్దీన్, అన్వర్ పాషా, శంకరయ్య, సురేష్, శివాజీ లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed