ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన మంత్రులు..

by Mahesh |
ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన మంత్రులు..
X

దిశ, వైరా: గత 17 సంవత్సరాల నుండి ఎన్నో అవాంతరాలు ఒడిదుడుకుల మధ్య కలగా మిగిలిపోయిన ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు ఎట్టకేలకు పూర్తి కావడం జరిగింది. సుమారు 89 లక్షల రూపాయల ఖర్చుతో నూతనంగా నిర్మించిన ఇండోర్ స్టేడియం ను రాష్ట్ర ఎక్సైజ్ క్రీడల యువజన సర్వీసుల శాఖ పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ముందు శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఇండోర్ స్టేడియం ని ప్రారంభించి.. నూతనంగా ఏర్పాటు చేసిన వుడ్ కోర్టులను మంత్రి శ్రీనివాస్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.

అనంతరం ఇండోర్ స్టేడియం నందు ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా మంత్రులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో క్రీడలు యువజన పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నామని ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా వెనకడుగు వేయకుండా క్రీడాకారుల ఉపయోగం కోసం మినీ ఇండోర్ స్టేడియం ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. స్పోర్ట్స్ అథారిటీ అభివృద్ధి కోసం తాను ముందు ఉంటానని ఎమ్మెల్యే రాములు నాయక్ విజ్ఞప్తి మేరకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు 2 కోట్ల నిధులు విడుదల చేస్తానని ఆయన సభ పూర్వకంగా హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ అథారిటీ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు క్రీడాకారులను అన్ని రంగాల్లో రాణించేందుకు అవసరమైన వనరులను సమకూర్చుతున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు.



మంత్రుల సభలో నిరసన సెగ

ఇండోర్ స్టేడియం ప్రారంభించేందుకు వచ్చిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే రాములు నాయక్ వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొనగా ఎమ్మెల్యే రాములు నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు చేదు అనుభవం ఎదురైంది. సభ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే మంత్రి మాట్లాడుతుండగా.. ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు ప్లకార్డులు చేతబట్టి ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి ఉద్యోగాలలో తీసుకోవాలని నినాదాలు చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఇంతలో పోలీసులు తేరుకొని నినాదాలు చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్‌లను అక్కడి నుండి తొలగించేందుకు ప్రయత్నం చేయగా తమ సమస్యను మంత్రి దృష్టికి చెప్పేందుకు ప్రతిఘటించడంతో ఇరు వర్గాల మధ్య కొంత తోపులాట జరగడంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలగజేసుకుని ఫీల్డ్ అసిస్టెంట్ లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఈ సమస్య సద్దుమణిగింది.



స్పీడ్ బోటు‌లను ప్రారంభించిన మంత్రులు

టూరిజం డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో వైరా రిజర్వాయర్ నందు 13 లక్షల రూపాయల వ్యయంతో 2 స్పీడ్ బోట్‌లను మంత్రులు ప్రారంభించారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్సీ తాతా మధు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ జిల్లా కలెక్టర్ గౌతమ్ ఎమ్మెల్యే రాములు నాయక్ తో కలిసి వైరా రిజర్వాయర్ లో నూతనంగా ప్రారంభించిన బోట్లలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. అనంతరం రిజర్వాయర్ ఆనకట్ట పై మంత్రులు మొక్కలు నాటారు.



ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం

వైరా లోని ఎన్ వి ఎస్ గార్డెన్ నందు ఖమ్మం జిల్లాకు చెందిన ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల పనితీరు భేషుగ్గా ఉందని విధినిర్వహణలో వెనకడుగు వేయకుండా నిక్కచ్చిగా పనిచేసే అధికారులను ప్రభుత్వం ఎప్పటికీ మరిచిపోదన్నారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ తో పాటు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పైన ఉందన్నారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆయన పిలుపునిచ్చారు.అలాగే ఇతర రాష్ట్రాల నుండి మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన బాధ్యత ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సిబ్బందిపై ఉందన్నారు.


అనంతరం విధినిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ci సర్వేశ్వరరావును శాలువాతో సత్కరించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఎక్సైజ్ శాఖ అధికారులకు సిబ్బందికి శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు, ఎక్సైజ్ సూపరిండెంట్ సోమిరెడ్డి కిరణ్, ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, జిల్లాలో వివిధ సర్కిళ్లలో పనిచేసే ఎక్సైజ్ సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed