20 ఏళ్లుగా పెప్సీకి బానిస.. రోజుకు 30 క్యాన్లు తాగి చివరకు ఇలా!

by Manoj |
20 ఏళ్లుగా పెప్సీకి బానిస.. రోజుకు 30 క్యాన్లు తాగి చివరకు ఇలా!
X

దిశ, ఫీచర్స్ :పెప్సీ డ్రింక్‌కు బానిసైన యూకే వ్యక్తి.. రోజుకు 10 లీటర్ల చొప్పున ఏకంగా 20 ఏళ్ల పాటు అదే డ్రింక్ తాగుతూ బానిసయ్యాడు. 41 ఏళ్ల వ్యక్తి ఆండీ క్యూరీ డైలీ ఉదయం ఒక లీటరు ఫిజీ డ్రింక్‌‌‌తో తన దినచర్య ప్రారంభించి, ఆ రోజు మొత్తంలో మరో 9 లీటర్ల వరకు తాగేవాడు. సంవత్సరాల పాటు ఇదే అలవాటు కొనసాగించిన ఆండీ.. 8 వేల కిలోల చక్కెరకు సమానమైన దాదాపు 2 లక్షల 19 వేల పెప్సీ డబ్బాలను సేవించాడు. ఇందుకోసం తను ఏడాదికి దాదాపు రూ. 6.6 లక్షలు ($8,500) ఖర్చు చేయడం విశేషం.

ఈ క్రమంలోనే క్యూరీ బరువు 266 పౌండ్లకు పెరిగింది. మధుమేహం వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరించారు. దీంతో ఈ అలవాటు వదిలించుకోవాలని భావించాడు.మొత్తానికి వ్యాయామం, ఆహారం ద్వారా 28 పౌండ్లను తగ్గించగలిగాడు కానీ పెప్సీ తాగడం మాత్రం ఆపలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే లండన్‌కు చెందిన థెరపిస్ట్, హిప్నాటిస్ట్ డేవిడ్ కిల్ముర్రీని సంప్రదించగా.. అతను క్యూరీకి 'అవాయిడెంట్ రెస్ట్రిక్టివ్ ఫుడ్ ఇన్‌టేక్ డిజార్డర్(ARFID)' ఉన్నట్లు గుర్తించాడు. కేవలం ఒక ఆన్‌లైన్ సెషన్ ముగియగానే.. క్యూరీ రెండు దశాబ్దాల్లో మొదటిసారిగా నీరు తాగాడు. ప్రస్తుతం నెలరోజులుగా పెప్సీ డ్రింక్‌కు దూరంగా ఉంటూ నీటికే ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇక తన చర్మం కూడా కాంతివంతం కావడంతో తనకు చాలా ఎక్కువ శక్తి వచ్చిందని వివరించాడు. ఇలాంటి చక్కెర వ్యసనం ప్రమాదకరమైంది కాగా.. ఇది శరీరంలోని ముఖ్యమైన అవయవాలపై భారీ ఒత్తిడి కలిగిస్తుందని హిప్నాటిస్ట్ కూడా వెల్లడించాడు.

Advertisement

Next Story