సత్తా చాటిన బీజేపీ.. నాలుగు రాష్ట్రాల్లో వికసించిన కమలం

by GSrikanth |
సత్తా చాటిన బీజేపీ..  నాలుగు రాష్ట్రాల్లో వికసించిన కమలం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతిష్టాత్మకంగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటుకున్నది. ఇప్పటివరకు అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాల్లో మళ్ళీ పవర్‌లోకి రావడానికి దాదాపుగా లైన్ క్లియర్ అయింది. యూపీలో మరోసారి యోగి సర్కార్ కొలువుతీరనున్నది. గతంకంటే సీట్లు తగ్గుతున్నా ప్రభుత్వ స్థాపనకు అవసమైనన్ని స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఉత్తరాఖండ్‌లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీకి ఎలాంటి ఆటంకాలు లేకుండా పోయాయి. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అన్ని పార్టీలకంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో మద్దతు కూడగట్టడం అనివార్యమైంది.

ఉత్తరప్రదేశ్‌లో గతంలో 322 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ ఈసారి 55 సీట్లను కోల్పోయింది. ఇవన్నీ సమాజ్‌వాదీ పార్టీ ఖాతాలోకి చేరిపోయాయి. యూపీలోని పూర్వాంచల్, అవధ్, బుందేల్‌ఖండ్ రీజియన్లలో గతం కంటే పుంజుకున్నా పశ్చిమ ప్రాంతంలో మాత్రం దెబ్బ తగిలింది. సాగు చట్టాల ప్రభావం, రైతులు ఒక పార్టీగా ఏర్పడి పోటీ చేయడం లాంటి పలు కారణాలతో ప్రాభవం కోల్పోయింది. గతంకంటే సీట్లు తగ్గినా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. యోగి మరోసారి సీఎం కావడానికి ఎలాంటి అడ్డంకులూ లేవు.

పంజాబ్‌లో మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ కుప్పకూలింది. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో 77 సీట్లతో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. కానీ ఇప్పుడు అందులో 62 స్థానాలను కోల్పోతున్నది. కేవలం 15 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉన్నది. తొలిసారి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైంది. కేవలం ఇరవై సీట్ల బలం మాత్రమే ఉన్న ఈ పార్టీ వాటిని నిలబెట్టుకోవడంతో పాటు మరో 70 చోట్ల గెలుపునకు దగ్గరగా ఉన్నది. దాదాపు మూడింట రెండొంతుల మేర (90 సీట్లు) స్థానాల్లో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నది.

మణిపూర్‌లో గతంలో అత్యధికంగా 28 సీట్లలో గెలిచిన కాంగ్రెస్ ఈసారి దాదాపు 20 కోల్పోతున్నది. బీజేపీకి గతంలో 21 సీట్లు మాత్రమే ఉంటే ఈసారి అదనంగా మరో ఐదు సీట్లను గెల్చుకున్నది. నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్ పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఈసారి ఒంటరిగా 60 స్థానాల్లో పోటీ చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనన్ని సీట్లలో గెలవలేకపోయినా మరోసారి ఎన్‌పీపీ, జేడీయూలతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లైన్ క్లియర్ అయింది.

గోవాలోని 40 స్థానాల్లో గతంలో 20 చోట్ల గెలిచిన కాంగ్రెస్ ఈసారి 8 స్థానాలను కోల్పోతున్నది. గతంలో కేవలం 13 స్థానాల్లో గెలిచిన బీజేపీ ఈసారి అదనంగా 4 చోట్ల గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మద్దతు పొందడం అనివార్యమవుతున్నది. ఇప్పటివరకు అందుతున్న వివరాలను పరిశీలిస్తే బీజేపీ 17 చోట్ల, కాంగ్రెస్ 12 చోట్ల తృణమూల్ కాంగ్రెస్ 4 చోట్ల, ఆమ్ ఆద్మీ పార్టీ 3 చోట్ల గెలిచే అవకాశం ఉన్నది. దీంతో తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కీలకంగా మారాయి. ఈ రెండూ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటు సంక్లిష్టంగా మారింది.

ఉత్తరాఖండ్‌లోని 70 స్థానాల్లో బీజేపీ 44 చోట్ల గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ సాధించింది. గతంలో 57 స్థానాల్లో గెలిచిన బీజేపీ ఈసారి 13 సీట్లు కోల్పోయింది. ఇందులో 11 కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడ్డాయి. గతంలో కేవలం 11 చోట్ల మాత్రమే గెలిచిన కాంగ్రెస్ ఈసారి 22 చోట్ల ఆధిక్యంలో ఉన్నది. తొలిసారి బీఎస్పీ రెండు చోట్ల బోణీ కొట్టింది.

Advertisement

Next Story

Most Viewed