ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత.. విద్యార్థి సంఘాల ర్యాలీ!

by Web Desk |   ( Updated:2022-02-18 10:26:05.0  )
ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత.. విద్యార్థి సంఘాల ర్యాలీ!
X

శ, సికింద్రాబాద్: ఓయూలో గురువారం బహుజన విద్యార్థి సంఘాల నాయకులపై టీఆర్ఎస్వీ విద్యార్థులు చేసిన దాడిని నిరసిస్తూ.. శుక్రవారం ఓయూలో పలు విద్యార్థి సంఘాలు ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాయి. ఈ ర్యాలీలో బీఎస్ఎఫ్, బీజేఎస్, ఈబీసీ, జీవీఎస్, టీవీఎస్, ఎన్టీవీఎస్, ఎన్టీఎస్యూ, యువజన కాంగ్రెస్, ఓయూ జేఏసీ విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. గ్రూప్–1, 2, 3 నోటీఫికేషన్లు వెంటనే విడుదల చేయాలంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు.


ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఏడేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు నిరాశ, నిస్పృహలతో ఆత్మహత్యకు పాల్పడుతున్నా.. సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. ఒకవైపు నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఇవేమీ పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ జన్మదినం పేరుతో కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.

ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేపడితే టీఆర్ఎస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం టీఆర్ఎస్వీ నాయకులు దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. టీఆర్ఎస్వీ నాయకులు కర్రలతో దాడులకు పాల్పడుతూ విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేశారన్నారు.

టీఆర్ఎస్వీ విద్యార్థుల ఆగడాలు మితిమీరిపోయాయని, ప్రశ్నించే విద్యార్థులపై దాడులకు దిగుతున్నారని, వారి వైఖరి మార్చుకోవాలని, లేని పక్షంలో పర్యావసనాలు వేరుగా ఉంటాయన్నారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీచేయకుంటే ఆందోళనా కార్యక్రమాలు చేపడతామన్నారు. రోడ్డుపై బైటాయించిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి ఓయూ క్యాంపస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed