పోలీసులే ఉల్లం'ఘనులు'.. శిక్షించేదెవరు?

by GSrikanth |   ( Updated:2022-03-31 00:30:37.0  )
పోలీసులే ఉల్లంఘనులు.. శిక్షించేదెవరు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: చట్టాన్ని పక్కాగా అమలుచేయాల్సిన పోలీసులే నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. చట్టానికి తాము అతీతులమనే తీరులో వ్యవహరిస్తున్నారు. సామాన్యుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తూ సొంతంగా పాటించాల్సిన క్రమశిక్షణను తప్పుతున్నారు. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 52 ప్రకారం కార్లు, వ్యాన్‌ల లాంటి వాహనాలకు ముందువైపునా, వెనకవైపునా క్రాష్ గార్డ్, బుల్ బార్ లాంటి ఎక్స్ ట్రా ఫిట్టింగ్‌లు పెట్టుకోవడం నిషేధం. ఒకవేళ బిగించినట్లయితే తొలిసారి గరిష్టంగా ఐదు వేల రూపాయల జరిమానా, రెండోసారి కూడా ఉల్లంఘినట్లు తేలితే పది వేల రూపాయల జరిమానాతో పాటు గరిష్టంగా ఒక ఏడాది కాలంపాటు జైలు శిక్ష విధించాలన్నది మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 192 (1)లో పేర్కొన్న నిబంధన.

కానీ, హైదరాబాద్ నగరంలో తిరుగుతున్న దాదాపు అన్ని పోలీసు (డయల్ 100 పాట్రోలింగ్) వాహనాలతో పాటు పోలీసు అధికారులు వ్యక్తిగతంగా వాడుతున్న ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు కూడా క్రాష్ గార్డు, బుల్ బార్‌లను వినియోగిస్తున్నారు. ఇవి వాహనానికి ఉన్న ఛాసిస్‌తో నేరుగా కనెక్షన్‌లో ఉన్నందున ప్రమాదానికి గురైనప్పుడు ఇంజన్ దెబ్బతినకుండా ఉంటుందన్నది ఒక వాదన. కానీ వీటి వలన పక్కన ప్రయాణిస్తున్నవాహనాలు, పాదచారులకు తగిలి ప్రాణాపాయానికి గురవుతున్నారని ఇంజినీర్లు, మంత్రిత్వశాఖ గతంలో కోర్టులకు సమర్పించిన అఫిడవిట్‌‌లలో పేర్కొన్నాయి. క్రాష్ గార్డు, బుల్ బార్‌లు లేనప్పుడు బైక్‌లకు, పాదచారులకు తగిలి జరిగే ప్రమాదాల్లో గాయాలతో బైటపడే అవకాశం ఉంటుందని, వీటిని బిగించిన తర్వాత ఎక్కువ ఫోర్స్‌తో ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువ అని పేర్కొన్నాయి.

కేంద్ర ఉపరితల రవాణా శాఖ వీటిని దృష్టిలో పెట్టుకుని 2017 డిసెంబరు 7న నోటిఫికేషన్ (నెం.11021/38/2017-ఎంవీఎల్)జారీ చేసింది. అన్ని రాష్ట్రాల రవాణా శాఖ కార్యదర్శులు, కమిషనర్లకు పంపింది. వాహనాలు క్రాష్ గార్డు, బుల్ బార్‌లను వినియోగించడం మోటారు వాహన చట్టంలోని సెక్షన్-52కు విరుద్దమని, ఉల్లంఘించినవారిపై సెక్షన్ 190, 191, 192(1) ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మద్రాసు హైకోర్టులో గతేడాది ఎల్‌డీ లెనిన్ పాల్ దాఖలుచేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యా (రిట్ పిటిషన్ 16027/2020)న్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ, జస్టిస్ పీడీ ఆదికేశవులులతో కూడిన ధర్మాసనం సెప్టెంబరు 21న తీర్పునిచ్చింది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సమర్ధించింది. తమిళనాడు వ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని ఆదేశించింది.

ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు స్టిక్కర్ల, బ్లాక్ ఫిల్ముల విషయంలో మద్రాసు హైకోర్టు గతేడాది ఆగస్టు 19న ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ చలాన్లను విధిస్తూ, కేసులు నమోదు చేస్తున్నందున అదే హైకోర్టు సెప్టెంబరులో ఇచ్చిన తీర్పునకు, కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 2017లో ఇచ్చిన నోటిఫికేషన్‌లను స్వయంగా ఎందుకు ఉల్లంఘిస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు తీర్పు, మోటారు వాహన చట్టం నిబంధనల మేరకే సామాన్యుల నుంచి జరిమానాలు వసూలు చేస్తున్నామంటూ సమర్ధించుకునే పోలీసులు ఇప్పుడు అదే హైకోర్టు, కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్, మోటారు వాహన చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించడంపై మౌనంగా ఉన్నారు.

చట్టాన్ని అమలుచేయాల్సిన పోలీసులే ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానాలు వసూలు చేయాల్సిందెవరు, కేసులు పెట్టాల్సిందెవరు, శిక్షించాల్సిందెవరు? మోటారు వాహన చట్టాన్ని తు.చ. తప్పకుండా అమలుచేయాల్సిన రాష్ట్ర రవాణా శాఖ అధికారులు సైతం చూసీ చూడనట్లుగానే వ్యవహరిస్తున్నారు. చట్టం కొద్దిమందికి చుట్టమా అనే సామాన్యుల అభిప్రాయమే ఇప్పుడు పోలీసులు చేస్తున్న ఉల్లంఘనల సందర్భంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed