- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విలీనమా.. పొత్తా..? తెలంగాణలో ఆప్ పాగాకు టీజేఎస్ జాగా!
తెలంగాణ జనసమితి ఆప్‌లో విలీనం కానున్నదా..? వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉండబోతున్నది. ఢిల్లీలో ప్రారంభమైన ఆప్ జైత్రయాత్ర పంజాబ్‌కు చేరింది.. దక్షిణాదిలో తెలంగాణ సరైన వేదిక అని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ భావిస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వచ్చే నెల 14న ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా టీజేఎస్‌ను ఆప్‌లో విలీనం చేస్తారని తెలుస్తున్నది. కోదండరాం క్లీన్ ఇమేజ్ తమకు కలిసివస్తుందని ఆప్ భావిస్తున్నది. టీజేఎస్ కార్యకర్తలు సైతం ఆప్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరిచూపు కోదండరాం వైపు మళ్లింది. విలీనం చేస్తారా..? కలిసి పోటీ చేస్తారా? అనేది తేల్చాల్సింది ఆయనే!
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. తెలంగాణ జన సమితిని విలీనం చేసుకోవాలనుకుంటున్నది. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలనుకుంటున్నది. తెలంగాణ సమాజంలో గుర్తింపు పొందిన, ఫేస్ వ్యాల్యూ కలిగిన కోదండరాంను చేర్చుకోవడం ద్వారా తమ పార్టీని బలోపేతం చేయవచ్చని భావిస్తున్నది. జనసమితి కేడర్ కూడా 'ఆప్'లో విలీనానికే సుముఖత చూపుతున్నారు. రెండు పార్టీల మధ్య విలీనం కోసం, కలిసి పనిచేయడం కోసం చర్చలూ జరుగుతున్నాయి. వచ్చే నెల 14న కేజ్రీవాల్ హైదరాబాద్ టూర్ సందర్భంగా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. విలీన ప్రక్రియను ఇటు కోదండరాం, అటు ఆప్ వర్గాలు ధ్రువీకరించడంలేదు. రెండు పార్టీలమధ్య చర్చలు జరుగుతున్నది నిజమేనని, రెండు వైపుల నుంచీ విలీనం ఆలోచనలున్నాయని ఆయా పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఢిల్లీ స్థాయిలోని జాతీయ నేతలతో నేరుగా చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలు రాష్ట్ర స్థాయిలో తెలిసే అవకాశం లేదని 'ఆప్' నేతలు వ్యాఖ్యానించారు. విలీనంపై రెండు పార్టీలకూ ఆయా స్థాయిల్లో అవసరం కూడా ఉన్నదని నొక్కిచెప్పారు. సరైన సమయం, సరైన వేదిక ద్వారా అధికారిక ప్రకటన రావచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పంజాబ్‌లో గెలుపు తర్వాత తెలంగాణలోనూ బలపడాలని భావిస్తున్న 'ఆప్'.. మేధావులతో, అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతున్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ కన్వీనర్ హోదాలో కోదండరాం.. ఆప్ నేతల మద్దతు కోరారు. అప్పటి నుంచి ఆ పార్టీ నాయకులతో సత్సంబంధాలున్నాయి. ఇప్పుడు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవడంపై 'ఆప్' దృష్టి పెట్టింది. అధికార పార్టీకి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్న శక్తులను కలుపుకుపోవాలని అనుకుంటున్నది. అవినీతి మచ్చ లేని కోదండరామ్‌ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా రాష్ట్రంలో బలపడవచ్చని అనుకుంటున్నది. మరోవైపు టీజేఎస్ కార్యకర్తలు కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పోలిస్తే 'ఆప్'లో విలీనం కావడమే ఉత్తమమనే భావనతో ఉన్నారు. రెండు రోజుల క్రితం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని రావిర్యాలలో జరిగిన టీజేఎస్ అంతర్గత సమావేశంలోనే పలు స్థాయిల్లోని నాయకుల నుంచి ఇదే ప్రతిపాదన వచ్చింది. కాంగ్రెస్ నేతలతో గతంలోనే చర్చలు జరిగాయి. కోదండరాం తన అభిప్రాయాన్ని స్పష్టంగానే చెప్పారు. ఇటీవల రాష్ట్ర బీజేపీ నేతల నుంచి కూడా విలీనం ఆఫర్ వెళ్లింది. కానీ ఎలాంటి నిర్ణయం వెలువడకుండా అర్ధంతరంగా భేటీ ముగిసినట్లు టీజేఎస్ వర్గాల సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో 'ఆప్'లో విలీనం కావడం ఆ రెండు పార్టీలతో పోలిస్తే ఉత్తమం అనే అభిప్రాయం మాత్రం రావిర్యాల సమావేశంలో టీజేఎస్ కార్యర్తలు, వివిధ స్థాయి లీడర్ల నుంచి వ్యక్తమైంది.
ఒక రాజకీయ పార్టీగా టీజేఎస్ ఏర్పడి ఏండ్లు గడుస్తున్నా ప్రజల్లో పార్టీ నిర్మాణం బలంగా వేళ్లూనుకోలేదన్న అభిప్రాయంతోనే కేడర్, లీడర్లు 'ఆప్'లో విలీనం ప్రతిపాదనను ప్రస్తావించారు. సమావేశం వేదికగా కోదండరాం ససేమిరా అని చెప్పడంతో పాటు టీఆర్ఎస్‌ను రానున్న ఎన్నికల్లో ఓడించడమే ప్రధాన ఎజెండా అని, ఆ లక్ష్యంగానే పనిచేయాలనే అంశాన్ని నొక్కిచెప్పారు. పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల సమయానికి ఎవరితో కలిసి పనిచేయాలనేదానిపై ఆ సమయంలో ఆలోచించుకోవచ్చని వారికి నచ్చచెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతానికి పార్టీ నిర్మాణాన్ని విస్తృతం చేయడంపైనే ఫోకస్ పెట్టాల్సిందిగా వారికి కోదండరాం సూచించారు.
ప్రొఫెసర్ కోదండరాంతో పాటు పలువురు మేధావులతోనూ 'ఆప్' సంప్రదింపులు జరుపుతున్నది. కేసీఆర్‌కు, రాష్ట్రంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే ఎజెండాతో 'ఆప్' ప్లాన్ చేస్తున్నందున ఆ ఆలోచనలు ఉన్నవారందరినీ సమీకరించాలనుకుంటున్నది. పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోనూ ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిపింది. తెలంగాణ ఉద్యమం కోసం జేఏసీ కన్వీనర్‌గా వివిధ సెక్షన్ల ప్రజలను సమీకరించిన కోదండరాంకు రాష్ట్రంలో ఉన్న గుర్తింపు 'ఆప్' విస్తరణకు ఉపయోగపడుతుందన్నది ఆ పార్టీ జాతీయ నేతల భావన. విలీనం కోసం కోదండరాంతో చర్చలు జరుగుతున్నది నిజమేనని, ఆ పార్టీలోని కేడర్, లీడర్లు కూడా దీన్నే కోరుకుంటున్నారని 'ఆప్' నేత ఒకరు తెలిపారు.
విలీనంపై ఎలాంటి నిర్ణయం జరగలేదు : ప్రొఫెసర్ కోదండరాం
"పంజాబ్‌లో గెలిచినందుకు అభినందించాలని అనుకున్నాను. కేజ్రీవాల్ హైదరాబాద్ వస్తే కలవడానికి కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. భావసారూప్యత కలిగిన పార్టీలతో పనిచేస్తాం. 'ఆప్' అలాంటి పార్టీ అనే అనుకుంటున్నాను. ఇప్పటివరకు విలీనం ప్రతిపాదన మా వైపు నుంచి వెళ్లలేదు. ఆ పార్టీ కూడా అడగలేదు. కలిసి పనిచేయాలన్న కోరిక మాత్రం రెండు పార్టీల్లోనూ ఉన్నది. భవిష్యత్తులో ఆ పార్టీతో కలిసి పనిచేయడంపై సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటాం. రెండు పార్టీలకు ఉమ్మడిగా ఉండే అంశాల్లో పరస్పరం సహకరించుకుంటాం. ఇప్పటికైతే విలీనం గురించి నిర్ణయం లేదు. ఆ తరహా చర్చలు కూడా జరగలేదు".