KCR National Media: కేసీఆర్ కొత్త నేషనల్ మీడియా ఛానెల్? బీజేపీకి షాకిచ్చేలా వ్యూహం

by Sathputhe Rajesh |   ( Updated:2022-08-02 07:34:04.0  )
Telangana CM KCR Plans to establish National Media
X

దిశ, వెబ్‌డెస్క్: Telangana CM KCR Plans to establish National Media| జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. గత కొంతకాలంగా ఈ విషయంలో కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో చర్చలు జరుపుతున్నారు. పలువురు జాతీయ స్థాయి రాజకీయ వేత్తలు, విద్యా, వ్యాపార, సామాజిక రంగ ప్రముఖులు, మాజీ ఉన్నతాధికారులతో భేటీలు నిర్వహిస్తూ జాతీయ రాజకీయాల్లో సాధ్యాసాధ్యాలపై గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో గత వారంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో మిస్టరీగా మారింది. వారం పాటు హస్తినలో మకాం వేసిన కేసీఆర్.. పర్యటన వెనుక మర్మం ఏంటన్నది ప్రశ్నగా మారింది. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి గట్టి షాక్ ఇవ్వాలనే కార్యచరణతో కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఢిల్లీ పర్యటనలో ఆ మేరకు ప్రభావం చూపేంతలా ఎలాంటి చర్చలు, భేటీలు జరిగినట్లు బయటకు తెలియరాలేదు. కానీ బీజేపీని నిలువరిచేలా భారీ స్కెచ్ విషయంలో కేసీఆర్ సీరియస్ గా వర్క్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుండటం ఆసక్తిగా మారింది.

త్వరలో సరికొత్త ఇంగ్లీష్ న్యూస్ ఛానల్?

నేషనల్ పాలిటిక్స్ లో రాణించాలంటే తన వాదాన్ని బలంగా వినిపించే మీడియా సంస్థ ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఇదే విషయమై రెండు రోజుల క్రితం కేసీఆర్ ఓ జాతీయ న్యూస్ సంస్థ ప్రతినిధితోనూ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. త్వరలో దేశ రాజకీయాలను ప్రభావితం చేసేలా ఓ ఇంగ్లీష్ ఛానల్ ప్రారంభిస్తానని కేసీఆర్ సదరు న్యూస్ ఛానల్ ప్రతినిధితో ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న అధిక భాగం జాతీయ స్థాయి మీడియా సంస్థలను బీజేపీ ప్రభావితం చేస్తోందని, అందువల్ల తానే స్వయంగా ఓ న్యూస్ ఛానల్ ను జాతీయ స్థాయిలో స్థాపించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రచార ఖర్చు తప్పించుకోవచ్చనే వ్యూహం?

నిజానికి కేసీఆర్ తీసుకోబోతున్న ఈ నిర్ణయం వెనుక ఓ కారణం కూడా ఉందనే మాట వినిపిస్తోంది. బీజేపీతో పోరాటం చేస్తున్న టీఆర్ఎస్.. చాలా కాలంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్దితో తెలంగాణ గ్రోత్ ను పోల్చి చూపే ప్రయత్నం చేస్తోంది. సందర్భం వచ్చిన ప్రతిసారి తమ ప్రభుత్వం సాధించిన విషయాలను జాతీయ మీడియాకు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ దినపత్రికల్లో సైతం టీఅర్ఎస్ సానుభూతి ప్రకటనలు వెల్లువెత్తున్నాయి. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గంపగుత్తలా వెలువడుతున్న ఈ ప్రకటనల కోసం పెద్ద మొత్తంలో నగదు చెల్లించుకోవాల్సి రావడం ఆర్థికంగా భారంగా మారుతోందనే ప్రచారం కూడా ఉంది. రాబోయే రోజుల్లో తరచూ ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం వస్తుందని, అందువల్ల అడ్వర్టైజ్ మెంట్స్ కోసం కోట్లలో ఖర్చు చేయడం కంటే సొంతంగా ఓ న్యూస్ ఛానల్ ను ఏర్పాటు చేసుకుంటే.. అది భవిష్యత్ లో కలిసి వస్తుందనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

విపక్షాల గొంతుకగా కేసీఆర్ కొత్త ఛానల్?

రాజకీయంగా సక్సెస్ రావాలంటే మీడియా తోడ్పాటు అవసరం అనే విషయం కేసీఆర్ కు తెలియనిది కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో తెలంగాణ ఉద్యమ పోరాటంలో అప్పటి ఆంధ్ర మీడియా సంస్థల ధోరణిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సొంత మీడియా సంస్థ లేకుంటే ముందుకు సాగడం కష్టమేనని భావించి తమకంటూ ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ను స్టార్ట్ చేశారు. ఉద్యమ కాలంలో ఆ ఛానెల్ సక్సెస్ ఫుల్ గా రన్ అయింది. ఆ అనుభవంతోనే జాతీయ స్థాయిలో ఓ ఇంగ్లీష్ ఛానల్ ను స్థాపించి దాన్ని బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా విపక్షాల గొంతుకగా తీర్చిదిద్దాలనేది కేసీఆర్ తాజా ఆలోచనగా తెలుస్తోంది. మొన్నటి ఢిల్లీ టూర్ లోనూ ఈ విషయం కేసీఆర్ సంబంధిత నిపుణులతో చర్చించారనే టాక్ వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి: కేసీఆర్, కేటీఆర్ కటౌట్లను జేసీబీతో కూల్చేసిన మున్సిపల్ అధికారులు

Advertisement

Next Story