26 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతే చర్చించొద్దా?: టీడీపీ

by Javid Pasha |
26 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతే చర్చించొద్దా?: టీడీపీ
X

దిశ, ఏపీ బ్యూరో : ప్రతిపక్ష పార్టీ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రజా సమస్యలపై ప్రశ్నలు సంధిస్తే ప్రభుత్వం భయపడుతుంది. అంశంపై చర్చించకుండా టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తోంది అని టీడీపీ ఆరోపించింది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటు సారా తాగి 26మంది మరణిస్తే ఆ మరణాలను సహజ మరణాలు అంటూ దేవాలయం లాంటి అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ అసత్యాలు చెప్తున్నారని టీడీపీ ఆరోపించింది. మంగళగిరిలోని ఎన్టీఆర్ కేంద్ర కార్యాలయంలో మంగళవారం టీడీపీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జంగారెడ్డి గూడెం మరణాలపై విచారణ జరిపించాలని కోరుతుంటే గత రెండు రోజులుగా శాసనసభలో నుంచి సోమవారం ఐదు మందిని, మంగళవారం 11 మందిని సస్పెండ్ చేయడం అన్యాయం. వాస్తవాలు మాట్లాడితే సస్పెండ్ చేయడం అధికార పార్టీకి నైజంగా మారింది. సస్పెండ్ చేయడమే కాకుండా సభ నుండి మార్షల్స్ చేత బయటికి గెంటించారు. 26 మంది ప్రాణాలు గాలిలో కలిసినా మీరు చిద్విలాసంగా నవ్వుకుంటూ అసెంబ్లీలో కూర్చోవడానికి మనసెలా వచ్చిందో ఒకసారి చెప్పాలి అంటూ సీఎం వైఎస్ జగన్‌ను టీడీపీ సభ్యులు ప్రశ్నించారు.

అసెంబ్లీలో జగన్ అబద్దాలు మాట్లాతున్నారు : అచ్చెన్నాయుడు

'పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో నాటు సారా తాగి 26 మంది ప్రాణాలు పోగొట్టుకున్న విషయంపై గత రెండు రోజుల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విచారణ జరిపించాలని ఘోషిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చి చర్చించమని కోరితే.. చర్చించకుండా కోరిన వారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. 26 మంది మృత్యువాత పడితే అది ముఖ్యమైన అంశం కాదా?. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఆ వ్యవహారంపై విచారణ కమిటీ వేసి విచారణ జరిపించాల్సింది పోయి అసత్యాలు చెప్తున్నారు. దేవాలయం లాంటి నిండు శాసనసభలో జంగారెడ్డిగూడెంలో నాటు సారా తయారు కావడమే లేదని సీఎం పచ్చి అబద్ధం మాట్లాడారు.

ఈ 26 మంది సహజ మరణం పొందారన్నారు. దీన్ని బట్టి సీఎంకు కనీస పరిజ్ఞానంలేదని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో నాసిరకం బ్రాండ్లు పెంచారు. స్టేట్ మెంట్‌కు అర్థం కూడా తెలియని మూర్ఖత్వపు ప్రభుత్వమిది. ప్రజల ప్రాణాలతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. నేను ముఖ్యమంత్రికి శాసన పక్ష ఉప నాయకుడిగా విచారణ జరపాలని కోరినా ఫలితం లేదు. జంగారెడ్డిగూడెంలో 58 వేల జనాభా ఉన్నారు. 2 శాతం జనం చనిపోతారు. ఆ లెక్కల ప్రకారం 90 మంది చనిపోవాలి. 26 మందే చనిపోయారని చెప్పి తేలిగ్గా మాట్లాడారు. ఇది సీఎం బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది. అసలు అక్కడ నాటుసారా కాచారా లేదా అని తెలుసుకోవాలి. గుడ్డిగా మాట్లాడారు. ఈ నాలుగు రోజుల్లో జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వం 33 కేసులు బుక్ చేశారు. 22 మందిని అరెస్టు చేశామన్నారు. ఎస్ ఐ ఇచ్చిన దానికి సమాధానం ఇవ్వమని కోరుతున్నాము. దోషులను శిక్షించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం' అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

నిర్ధాక్షిణ్యంగా సస్పెండ్ చేశారు: ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

జంగారెడ్డిగూడెంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, చిన్న చిన్న వృత్తులు చేసుకునేవారు కల్తీ సారా బారిన పడి చనిపోయారు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో బ్యాటరీ సారా, అమ్మోనియా సారా, యూరియా సారాలు అమ్ముతున్నారు. ఈ అవినీతి సొమ్ముతో వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. ప్రతి బట్టి నుండి కూడా రెండేసి లక్షల రూపాయలు మామూళ్లు వసూలు చేస్తున్నారు. వైసీపీ పాలనలో నాటుసారా కాయడం కుటీర పరిశ్రమగా మారింది. టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో దాడులకు పోలేదు, బూతులు మాట్లాడలేదు. కేవలం మృతుల పట్ల చర్చ చేపెట్టమని మాత్రం కోరాం. మా వద్ద ఉన్న వాస్తవాలు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తామని కోరాం. అయితే నిర్దాక్షిణ్యంగా అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.

4 రోజుల్లో 33 కేసులు నమోదు చేశాం. 18,300 లీటర్ల సారాని ధ్వంసం చేశామని , 63,048 కేజీల ఊట బెల్లాన్ని నాలుగు రోజుల్లో ధ్వంసం చేశామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ సారా ఏరులై పారుతోంది. వాస్తవాలు ఒక్కొక్కటి బయటికొస్తున్నాయి. రాష్ట్రంలో నాలుగు రోజుల్లో 1,029 కేసులు నమోదు చేశామనడంతోనే క్రైం రిపోర్టు ఎంత మోతాదులో ఉందో తెలుస్తోంది. చర్చను చేపట్టమని అడిగిన మమ్మల్ని సస్పెండ్ చేయడంకాదు, శాసనసభ సాక్షిగా ప్రజల్ని తప్పుదోవ పట్టించిన వారిని సస్పెండ్ చేయాలి'అని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు.

మార్షల్స్‌ చేత గెంటించి అవమానించారు : ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి

'జంగారెడ్డిగూడెం మరణాలపై విచారణ జరిపించాలని కోరుతుంటే గత రెండు రోజులుగా శాసనసభలో నుంచి నిన్న ఐదు మందిని, నేడు 11 మందిని సస్పెండ్ చేయడం అన్యాయం. వాస్తవాలు మాట్లాడితే సస్పెండ్ చేయడం అధికార పార్టీకి నైజంగా మారింది. సస్పెండ్ చేయడమే కాకుండా సభ నుండి మార్షల్స్ చేత బయటికి గెంటించారు. 245 లీటర్ల నాటుసారాను సీజ్ చేయడం, 33 కేసులు పెట్టి 22 మందిని అరెస్టు చేశామని పత్రికా ప్రకటనలో జంగారెడ్డిగూడెం ఎస్ఐ పేర్కొన్నారు. దీనికి సీఎం ఏం సమాధానం చెబుతారు? జంగారెడ్డిగూడెం నగరం మధ్యలో నేడు 11 ఎఫ్ఐఆర్‌లు చేస్తే అందులో ఒకటి నాటుసారా తయారు చేసే వ్యక్తుల మీద పోలీసు కేసు నమోదు చేయడం జరిగింది.

ఇలా సారా విచ్చలవిడిగా దొరుకుతుంటే సీఎం సారా కాయడం లేదనడం సమంజసమేనా? రఘురామకృష్ణంరాజు మీద గుంటూరు ప్రభుత్వ వైద్యులు తప్పుడు రిపోర్టులు ఇచ్చారు. అదేవిధంగా మీరు జీతాలు ఇచ్చే తప్పుడు డాక్టర్లతో స్టేట్ మెంట్లు తీసుకున్న విషయం ప్రజలు గ్రహించారు. జంగారెడ్డి మృతుల పట్ల పోస్టుమార్టం చేయించాల్సిన బాధ్యత సీఎంపై ఉంది. ఆ తర్వాత ప్రజలకు సమాధానం చెప్పాలి. సభను తప్పుదోవ పట్టించారు. 26 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినా మీరు చిద్విలాసంగా నవ్వుకుంటూ అసెంబ్లీలో కూర్చోవడానికి మనసెలా వచ్చిందో ఒకసారి చెప్పాలి' అని టీడీపీ ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed