ఆ త‌హ‌సీల్దార్‌ను స‌స్పెండ్ చేయాలి: ర‌వీంద్రాచారి

by Satheesh |
ఆ త‌హ‌సీల్దార్‌ను స‌స్పెండ్ చేయాలి: ర‌వీంద్రాచారి
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూముల‌ను ప‌రిర‌క్షించాల‌ని త‌హ‌సీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వ భూముల‌కు కాపలా ఉండలా అంటూ బాధ్యతార‌హితంగా వ్యవ‌హ‌రించిన హ‌య‌త్‌న‌గ‌ర్ మండ‌ల త‌హ‌సీల్దార్ సుశీల‌ను స‌స్పెండ్ చేయాల‌ని సీపీఐ రాష్ట్ర కార్యవ‌ర్గ స‌భ్యులు ఆందోజు ర‌వీంద్రాచారి డిమాండ్ చేశారు. ఈ మేర‌కు సీపీఐ ఆధ్వర్యంలో సోమ‌వారం రంగారెడ్డి జిల్లా క‌లెక్టర్ కార్యాల‌యం ముందు ధ‌ర్నా చేశారు. అనంత‌రం క‌లెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా ర‌వీంద్రచారి మాట్లాడుతూ.. హ‌య‌త్‌న‌గ‌ర్ మండ‌లం బాగ్ హ‌య‌త్‌న‌గ‌ర్ గ్రామ రెవెన్యూ స‌ర్వే నంబ‌ర్ 308లో సుమారు 7ఎక‌రాల ప్రభుత్వ భూమి ఉంద‌న్నారు. ఇటీవ‌ల భూ క‌బ్జాదారులు, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు న‌కిలీ ప‌త్రాలు సృష్టించి అక్రమ నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని ఆందోళ‌న వ్యక్తం చేశారు. ఈ విష‌యాన్ని హ‌య‌త్‌న‌గ‌ర్ త‌హ‌సీల్దార్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా క‌బ్జాదారుల‌కే వ‌త్తాసు ప‌లుకుతుంద‌న్నారు.


శ‌నివారం ప్రభుత్వ భూముల క‌బ్జాపై ఏమైనా చ‌ర్యలు తీసుకున్నారా మేడం అని ఫోన్ ద్వారా తెలుకునే ప్రయ‌త్నం చేశామ‌న్నారు. దీంతో విచ‌క్షణ కోల్పోయి 'ప్రభుత్వ భూముల‌కు కాపలా ఉండాలా.. మీకు కాపలా ఉండాలా.. మాకు వేరే ఏమీ ప‌ని లేదా..?' అంటూ బాధ్యతార‌హితంగా వ్యవ‌హ‌రించింద‌న్నారు. త‌హ‌సీల్దార్ సుశీల క‌బ్జాదారుల‌తో, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌తో కుమ్మకైంద‌ని ఆరోపించారు. వెంట‌నే హ‌య‌త్‌న‌గ‌ర్ మండ‌ల త‌హ‌సీల్దార్ సుశీల‌పై చ‌ర్యలు తీసుకోవాల‌ని, విధుల నుండి స‌స్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. లేని ప‌క్షంలో సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ స‌భ్యులు ముత్యాల యాదిరెడ్డి, సీపీఐ హ‌య‌త్‌న‌గ‌ర్ మండ‌ల అధ్యక్షులు శేఖ‌ర్‌రెడ్డి, నాయ‌కులు ర‌మావ‌త్ స‌క్రీ, కే. సుభ‌ద్ర, టి. న‌ర్సింహా, క‌ల్యాణీ, స‌రిత‌, రాధ‌, ఉషా, క‌ళావ‌తి, జ‌య‌మ్మ, పారిజాత త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story