ఎంత పని చేశావు తమ్ముడు..? స్వరాజ్యం మనసు నుండి చెరిగిపోని ఆ సంఘటన

by Mahesh |   ( Updated:2022-03-19 14:54:16.0  )
ఎంత పని చేశావు తమ్ముడు..? స్వరాజ్యం మనసు నుండి చెరిగిపోని ఆ సంఘటన
X

దిశ, తుంగతుర్తి: ఓటమిని తన కాలి చిటికెన వేలితో తన్నుకుంటూ ధైర్యంతో విజయం వైపు సాగిపోయే వీరనారి,తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం తన జీవితంలో జరిగిన రెండే రెండు సంఘటనలు మర్చిపోలేనిదిగా నిలిచిపోయాయి. నిజాం నవాబుకు వ్యతిరేకంగా సాగించిన అలుపెరుగని పోరాటం ఒకవైపు సాగితే మరోవైపు మాత్రం తన సొంత సోదరుడు (తమ్ముడు) భీమిరెడ్డి కుశలవ రెడ్డి పరోక్షంగా వేసిన పాచికల తో స్వరాజ్యం ఓటమికి బలైంది.బంధుత్వాలు ఉంటే బయటనే కానీ రాజకీయాల్లో మాత్రం కావనే తీర్పు ఆమెకు కాల రాత్రులు గా మారాయి. తన తమ్ముడు కుశలవ రెడ్డి గుర్తుకు వచ్చినప్పుడల్లా "ఎంత పని చేసావు తమ్ముడు" అంటూ లోలోన స్వరాజ్యం కుమిలిపోయారు.

ఇంతకు తమ్ముడు చేసిన పాపం ఏంటి...?

1957లో పిడిఎఫ్ నుండి,1967లో సిపిఎం నుండి అన్న భీమిరెడ్డి నరసింహారెడ్డి ని శాసనసభ్యునిగా అక్కున చేర్చుకున్న తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం అదే తరహాలో చెల్లెలు మల్లు స్వరాజ్యం ను 1978లో సిపిఎం నుండి గెలిపించుకుంది. ఆనాడు కాంగ్రెస్ అభ్యర్థి ఓరుగంటి వెంకటనరసయ్య కు 15 వేల 598 ఓట్లు వస్తే స్వతంత్ర అభ్యర్థి జెన్నారెడ్డి శ్యాంసుందర్ రెడ్డి కి 19 వేల 933 ఓట్లు లభించాయి. సిపిఎం నుండి పోటీ చేసిన స్వరాజ్యం కు 25 వేల 580 ఓట్ల ను తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలు కట్టబెట్టి గెలిపించుకున్నారు. అలాగే 1983లో రెండవ మారు కాంగ్రెస్ అభ్యర్థి కె.విజయ సేనా రెడ్డి పై ( 17,568 ఓట్లు) సిపిఎం నుండి పోటీ చేసిన మల్లు స్వరాజ్యం (19,465 ఓట్లు) విజయం సాధించారు.


ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ స్వరాజ్యం కు 1985 నుంచి ఓటమి స్వాగతం పలికింది.ఆ రోజు సిపిఎం,తెలుగుదేశం పార్టీల పొత్తులో భాగంగా తుంగతుర్తి నుంచి పోటీ చేసే అవకాశం సిపిఎం నుండి స్వరాజ్యం కి దక్కింది. అయితే టీడీపీలో ఉన్న సోదరుడు భీమిరెడ్డి కుశలవ రెడ్డి తనకు పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం రాలేదనే ఆగ్రహంతో పరోక్షంగా కాంగ్రెస్ అభ్యర్థి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గెలుపుకు దోహదపడ్డారు. దామోదర్ రెడ్డి కి 45,085 ఓట్లు వస్తే స్వరాజ్యం కు మాత్రం 32,990 ఓట్లు వచ్చాయి.అగ్ర స్థాయిలో ఒప్పందం ప్రకారం తెలుగుదేశం నుండి కుశలవ రెడ్డి, కొంత మంది స్వరాజ్యం కు సహకరించలేదనే విమర్శలు ఆ రోజుల్లో బలంగా ప్రచారమయ్యాయి.

చివరికి టిడిపి నుండి కుశలవ రెడ్డి తొలిసారిగా సస్పెన్షన్ కు గురయ్యారు.ఇక 1985 నాటి సీన్ 1989లో కూడా పునరావృతమైంది. మిత్రపక్షమైన సిపిఎం మద్దతుతో తెలుగు దేశం నుండి కుశలవ రెడ్డి టికెట్ ఆశించారు. కానీ ఇరు పార్టీల ఒప్పందంలో తిరిగి సిపిఎం పార్టీకి ,అందులోనూ మల్లు స్వరాజ్యం కు పోటీ చేసే అవకాశం లభించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తమ్ముడు భీమిరెడ్డి కుశలవ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ రంగంలోకి దిగారు. ఇది రెండోమారు కాంగ్రెస్ అభ్యర్థి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గెలుపుకు దోహదపడింది. దామోదర్ రెడ్డి కి 36,125 ఓట్లు వస్తే స్వరాజ్యం కు 31,072 వచ్చాయి.స్వతంత్ర అభ్యర్థి కుశలవరెడ్డి కి 25,157 ఓట్లు లభించాయి.

ఈ పరిణామాలతో తమ్ముడు కుశలవ రెడ్డి రెండోమారు తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కృతులకు కారణంగా మారింది. ముఖ్యంగా మిత్రపక్షాల ఒప్పందం మేరకు తమ్ముడు కుశలవ రెడ్డి అక్క స్వరాజ్యం గెలుపుకు దోహదపడితే గెలుపు కాయం గా మారేదని అప్పట్లో విస్తృత ప్రచారం జరిగింది. ఈ పరిణామాలన్నీ స్వరాజ్యం జీవితంలో ఓ మచ్చగా మిగిలి మిగిలిపోయాయని చెప్పవచ్చు."ఎంతపని చేశావు తమ్ముడు" అంటూ ఆ రోజుల్లో కుశలవ రెడ్డిని సంబోధిస్తూ అక్క స్వరాజ్యం పేర్కొనడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed