భారత మార్కెట్లో కొత్త బైకును విడుదల చేసిన సుజుకి!

by GSrikanth |
భారత మార్కెట్లో కొత్త బైకును విడుదల చేసిన సుజుకి!
X

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి ఇండియా తన కొత్త స్పోర్ట్స్ బైకును భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో మెరుగైన ఆదరణను సాధించిన కటానా మోటార్‌సైకిల్‌ను సోమవారం దేశీయంగా తీసుకొచ్చింది. దీని ధరను రూ. 13,61,000గా నిర్ణయించామని, జపాన్‌లో పురాతన కత్తికి ప్రేరణగా భావించే కటానా పేరును ఈ బైకుకు పెట్టామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

జూలై 4 నుంచి దేశవ్యాప్తంగా కంపెనీకి చెందిన డీలర్‌షిప్‌ల వద్ద ఈ బైకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. భారత్‌లో ఈ బైకును విడుదల చేయడంతో చాలా సంతోషంగా ఉంది. దేశీయంగా తమ మోటార్‌సైకిల్ పోర్ట్‌ఫోలియోను మరింత పటిష్టం చేసేందుకు 'కటానా' ఎంతో ఉపయోగపడుతుందని సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సతొషి ఉచిడా చెప్పారు. కటానా బైక్ 999సీసీ ఫోర్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది ఆరు గేర్లను కలిగి ఉంటుంది. గతేడాది జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఈ బైకును ప్రదర్శించిన సమయంలో చాలామంది ఈ బైకు గురించి వివరాలు సేకరించారని, వినియోగదారుల నుంచి ఉన్న ఆసక్తిని గమనించి భారత మార్కెట్లోకి దీన్ని తీసుకొచ్చినట్టు సతొషి చెప్పారు. ఈ బైకు ప్రత్యేకంగా మెస్టిక్ సిల్వర్, మెటాలిక్ స్టీలర్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. డ్యుయెల్ ఏబీఎస్, డ్రైవ్ మోడ్ సెలెక్టర్ సహా అనేక అత్యాధునిక ఫీచర్లు ఇందులో అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed