కూలిన ఇంట్లో వెండి నాణేలు.. అక్కడ ఇప్పుడే ఇల్లు కట్టొద్దని ఎమ్మార్వో హుకుం

by S Gopi |
కూలిన ఇంట్లో వెండి నాణేలు.. అక్కడ ఇప్పుడే ఇల్లు కట్టొద్దని ఎమ్మార్వో హుకుం
X

దిశ, మక్తల్: కూలిన మట్టి ఇంట్లో వెండి నాణేలు దొరకడంతో పురావస్తుశాఖ సర్వే చేసి తమకు రిపోర్ట్ ఇచ్చేంతవరకు ఇంటి నిర్మాణం చేపట్టరాదని ఉట్కూర్ తహశీల్దార్ ఆ ఇంటి యజమానికి హుకుం జారీ చేశారు. ఈ ఘటన మక్తల్ నియోజకవర్గం ఉట్కూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కూలిపోయిన ఇంటిని పునర్నిర్మించేందుకు మట్టిని తొలగిస్తుండగా పెద్ద మొత్తంలో వెండి నాణేలు దొరికాయి. వాటిని బయటకు పొక్కనివ్వకుండా ఇంటి యజమాని కూలి వాళ్లకు కొన్ని నాణేల ఇచ్చి మ్యానేజ్ చేసుకున్నాడు. కాగా తవ్విన మట్టిని వైకుంఠ ధామంలో వేయగా మట్టిలో కలిసిపోయిన కొన్ని వెండి నాణేలు అటువైపు బహిర్భూమికి వెళ్లిన యువకులకు కనబడడంతో వ్యవహారం బహిర్గతమైంది. రెవెన్యూ అధికారులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇంటి వారి నుండి మొక్కుబడిగా ఆరు నాణేలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. ఇది ఇటీవల కురిసిన వర్షాలకు ఆ సమయంలో పెద్ద మొత్తంలో వెండి నాణేలు దొరికాయని, భవంతిలా అతి పెద్దగా ఉన్న చెక్క వస్తువులను తీసేటప్పుడు మరోసారి, ప్రస్తుతం మట్టిని తొలగించేటప్పుడు మూడోసారి నాణేలు దొరికినట్టు గ్రామంలో ప్రచారం ఉంది.

ఉట్కూర్ మండలానికి చెందిన ఘాళ నీలిరాజు వంశస్తులు చుట్టపక్కల గ్రామాలకు అప్పులు ఇచ్చే ధనిక కుటుంబం. వారు 1835 సంవత్సరంలో అర ఎకరం విస్తీర్ణంలో ప్రస్తుతం కూలిపోయిన ఇంటిని నిర్మించారు. ఉమ్మడి కుటుంబంగా కొనసాగిన వీరు భాగ పరిష్కారమప్పుడు పశువులకు మేత పెట్టే వెదురు దుంపలతో బంగారు, వెండి నాణేలను భాగాలుగా తీసుకున్నారని, ఇదే కాకుండా అప్పుడు దాచడానికి గోడల్లో ఇంటి స్తంభాలలో నేలమాణిగెల్లో ఉంచేవారని.. కాలక్రమేణా వారి ఇంటి యజమానులు అకస్మాత్తుగా చనిపోవడంతో అది కాస్త మరుగున పడింది. అందుబాటులో ఉన్నవారు ఆస్తులను భాగాలుగా చేసుకోవడంతో ఈ పెద్ద భవంతి ఉమామహేశ్ కు వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ భవంతి కూలిపోవడంతో అసలు విషయం బయటపడింది. అది కాస్త వైరలై అధికారుల దృష్టికి వెళ్లడంతో పురావస్తు శాఖ వారు సర్వే చేసిన తర్వాతనే మీరు ఇల్లు నిర్మించుకోవాలని ఇంటి యజమానులకు ఉట్కూర్ తహశీల్దార్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితేవారు పెద్దలు సంపాదించిన ధనానికి ప్రభుత్వ అధికారులు ఎందుకు అడ్డు చెబుతారని.. అది ఇంటి యజమానులకే చెందాలని గ్రామస్తులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed