Stock Market: వరుస భారీ నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న స్టాక్ మార్కెట్

by Harish |   ( Updated:2022-04-19 12:52:47.0  )
Stock Market: వరుస భారీ నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న స్టాక్ మార్కెట్
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. భారీగా అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు వరుసగా ఐదవ సెషన్‌లో పతనాన్ని చూశాయి. మంగళవారం ట్రేడింగ్‌లో ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు(Stock Market) మిడ్-సెషన్ వరకు ఊగిసలాట మధ్య కదలాడాయి. ఓ దశలో లాభాల్లో పయనించిన తర్వాత చివరి గంటలో మదుపర్లు అమ్మకాలకు ఎగబడటంతో ఒక్కసారిగా నష్టాలు పెరిగాయి. ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ, రష్యా-ఉక్రెయిన్ ఆందోళనలు కొనసాగడం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, ముడి చమురు ధరలు పెరగడం ప్రతికూలంగా మారాయి. ఇక దేశీయంగా అధిక ద్రవ్యోల్బణానికి తోడు ఎఫ్ఐఐల నిధుల ఉపసంహరణ అంశాలు నష్టాలు పెరగడానికి కారణమయ్యాయి.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 703.59 పాయింట్లు కోల్పోయి 56,463 వద్ద, నిఫ్టీ 215 పాయింట్లు పతనమై 16,958 వద్ద ముగిశాయి. నిఫ్టీ లో ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్ రంగాలు 2 శాతానికి పైగా పడిపోయాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, హిందూస్తాన్ యూనిలీవర్, నెస్లె ఇండియా, కోటక్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, డా రెడ్డీస్ 3-6 శాతం మధ్య నీరసించాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.55 వద్ద ఉంది.

Advertisement

Next Story