మరోసారి నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు!

by Disha Desk |
మరోసారి నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి నష్టాలను ఎదుర్కొనక తప్పలేదు. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా భారత స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. గత సెషన్‌లో యుద్ధ భయాలను అధిగమించి లాభాల్లో పయనిస్తున్నట్టు కనిపించిన సూచీలు ఒకరోజు సెలవు తర్వాత పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేకపోగా, మరింత క్లిష్టంగా మారుతుండటంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల నుంచి సాయం లభిస్తుండటం, రష్యా దాడిని మరింత పెంచడం వంటి పరిణామాలు గ్లోబల్ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లను సైతం కలవరపెట్టాయి. ఇదే సమయంలో ముడి చమురు ధర బ్యారెల్‌కు 110 డాలర్లు దాటిపోవడం, ద్రవ్యోల్బణ ఆందోళనలను మరింత పెంచాయి. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 778.38 పాయింట్లు పడిపోయి 55,468 వద్ద, నిఫ్టీ 187.95 పాయింట్లు క్షీణించి 16,605 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, మీడియా ఇండెక్స్‌లు మాత్రమే రాణించాయి, ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు అధికంగా నిరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, టైటాన్, రిలయన్స్, నెస్లె ఇండియా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకోగా, మారుతి సుజుకి, డా. రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, సన్‌ఫార్మా, రిలయన్స్, కోటక్ బ్యాంక్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.73 వద్ద ఉంది.

Advertisement

Next Story