ఊగిసలాట మధ్య లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

by Disha Desk |
ఊగిసలాట మధ్య లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఊగిసలాట మధ్య సోమవారం ట్రేడింగ్‌లో లాభాలను సాధించాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో చర్చలకు సంబంధించిన సంకేతాలు ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంట్‌ను పెంచింది. ఉదయం ప్రారంభమైన సమయంలో రష్యా న్యూక్లియర్ ప్రయోగానికి సంబంధించిన సమాచారంతో నష్టాలను చూసిన సూచీలు ఆ తర్వాత పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా మదుపర్లు సానుకూలంగానే స్పందించారు. ఐదో రోజు కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి చర్చలకు ఇరు దేశాలు పిలుపునివ్వడం, దేశీయ మార్కెట్లలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు సిద్ధపడటం వంటి పరిణామాలు కలిసొచ్చాయి. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 388.76 పాయింట్లు పెరిగి 56,247 వద్ద, నిఫ్టీ 135.50 పాయింట్ల లాభంతో 16,793 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్ అత్యధికంగా 4.95 శాతంతో రాణించగా, ఐటీ ఇండెక్స్ పుంజుకుంది. మిగిలిన వాటిలోని కీలక రంగాలు సానుకూలంగా ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, రిలయన్స్, టైటాన్, ఎన్‌టీపీసీ, ఎల్అండ్‌టీ షేర్లు అధిక లాభాల్లో కదలాడగా, డా రెడ్డీస్, ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.30 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed