పంచాయతీ కార్యదర్శిని నిలబెట్టి ఆదేశాలు జారీ చేసిన సర్పంచ్ భర్త

by GSrikanth |
పంచాయతీ కార్యదర్శిని నిలబెట్టి ఆదేశాలు జారీ చేసిన సర్పంచ్ భర్త
X

దిశ, శంకరపట్నం: అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి పరచడంలో భాగంగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించి, రాజకీయ పదవుల్లోనూ ముందుండాలని ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకుంటున్నది. అయితే, ఈ మహిళా రిజర్వేషన్లను కూడా గెలుపొందిన మహిళల భర్తలు కాలరాస్తు్న్నారు. తాజాగా.. శంకరపట్నం మండలంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. సోమవారం మండల కేంద్రంలోని కేశవపట్నం గ్రామ సర్పంచ్ బండారి స్వప్న తిరుపతి చేష్టలే ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి. కేశవపట్నం బస్టాండ్ వెనుక సోమవారం అంగడి కావడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హుజురాబాద్ డిపో మేనేజర్ రజిని కృష్ణ, సిబ్బందితో కలిసి అంగడి నిర్వహణను అడ్డుకున్నారు.

దీంతో ఘటనా స్థలానికి గ్రామ పంచాయతీ పాలకవర్గంతో పాటు, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ భర్త తిరుపతి చేరుకొని వ్యాపారస్తులతో మాటామంతి జరిపారు. ఈ సమయంలో కేశవపట్నం సర్పంచ్ బండారి స్వప్న భర్త తిరుపతి గ్రామ పంచాయతీ కార్యదర్శిని కుర్చీలోంచి లేపి నిలబెట్టి ఆదేశాలు జారీ చేశాడు. దీంతో అక్కడున్న కొంతమంది మహిళలు సర్పంచ్‌ భర్తపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. నియంత్రించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మహిళల హక్కులను కాలరాస్తున్న పురుషులపై, చట్టపరంగా చర్యలు తీసుకొని, మహిళల హక్కులను కాపాడాలని ప్రజలు కోరుచున్నారు.

Advertisement

Next Story

Most Viewed