సీఎం ప్రకటనతో రూ.100 కోట్లకుపైగా ఆదాయం!

by Nagaya |   ( Updated:2022-03-10 01:00:28.0  )
సీఎం ప్రకటనతో రూ.100 కోట్లకుపైగా ఆదాయం!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉద్యోగాల భర్తీ ప్రక్రియతో రిక్రూట్​మెంట్​ సంస్థలకు మాత్రం ఆదాయం భారీగా రానుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తే లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అభ్యర్థుల నుంచి రెండు రకాలుగా ఫీజులు చెల్లించాల్సి ఉంటోంది. అందులో ఒకటి అప్లికేషన్​ ఫీజు కాగా మరొకటి ఎగ్జామ్​ ఫీజు. టీఎస్​పీఎస్సీకి చెల్లించే ఫీజులు తక్కువగానే ఉన్నప్పటికీ.. పోలీస్, వైద్యారోగ్య బోర్డులకు చెల్లించేవి మాత్రం కొంత ఎక్కువగానే ఉంటోంది. అటు విద్యాశాఖకు సంబంధించిన దరఖాస్తు రుసుం కూడా ఎక్కువే.

రూ. 100 కోట్లకుపైగా ఆదాయం

ప్రస్తుతం 80 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్​ వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులున్నట్లు అంచనా వేస్తున్నారు. టీఎస్​పీఎస్సీ వన్​ టైం రిజిస్ట్రేషన్‌లోనే 24.60 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్​కాగా, ఉపాధి కల్పన సంస్థలో కూడా 11 లక్షలున్నారు. కొంతమంది ప్రైవేట్​ఉద్యోగాల్లో ఉన్నా.. 30 లక్షల మంది నిరుద్యోగులు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడుతారని అంచనా వేస్తున్నారు.

ఇక టీఎస్​పీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టులకు దరఖాస్తు ఫీజు రూ. 250 వరకు ఉంటోంది. దీన్ని రూ. 200కు తగ్గించే అవకాశాలున్నాయి. త్వరలోనే టీఎస్​పీఎస్సీ నిర్ణయం తీసుకోనుంది. ఒక ప్రభుత్వ శాఖలో నోటిఫికేషన్​ వస్తే రూ. 200 చొప్పున దరఖాస్తు ఫీజు వసూలు చేసినా కనీసం 20 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఈ ఆదాయమే రూ. 40 కోట్లు వరకు రానుంది. అంతేకాకుండా పలుమార్లు వివిధ శాఖల నోటిఫికేషన్లు విడుదలైతే ఏ శాఖలో ఉద్యోగానికి అప్లై చేసుకున్నా అప్లికేషన్​ ఫీజు ఖచ్చితంగా రూ. 200 చొప్పున చెల్లించాల్సిందే. దీంతో ఎన్ని ఉద్యోగాలకు, ఎన్నిసార్లు అప్లై చేసినా రూ. 200 చెల్లించాల్సిందే. అంతేకాకుండా పరీక్షా ఫీజులో కొంత ఉపశమనం లభిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకు పరీక్ష ఫీజును మాఫీ చేయనుండగా, ఓసీతో పాటు ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం చేస్తూ ఇతర పోస్టులకు పరీక్ష రాసేందుకు సిద్ధమైతే రూ. 120 చెల్లించాల్సి ఉంటోంది. గెజిటెడ్​స్థాయి అధికారులు రూ. 120 చొప్పున, నాన్​ గెజిటెడ్​ సిబ్బంది రూ. 80 చొప్పున పరీక్ష ఫీజు చెల్లించాలి.

ఇక పోలీస్​రిక్రూట్​మెంట్​ బోర్డు, విద్యాశాఖ, మెడికల్​ రిక్రూట్​మెంట్​ బోర్డులు కొంత ఎక్కువగానే వసూలు చేస్తాయి. పోలీస్​ రిక్రూట్​మెంట్​లో దరఖాస్తు ఫీజు రూ. 800గా ఉంటోంది. ఏ పోస్టుకైనా అంతే చెల్లించాలి. అదేవిధంగా విద్యాశాఖ, మెడికల్​ రిక్రూట్​మెంట్​ బోర్డులు రూ. 500 చొప్పున అప్లికేషన్​ ఫీజు వసూలు చేస్తాయి. ఈ రిక్రూట్​మెంట్​ బోర్డులు ఈసారి ఫీజులను సవరించే అవకాశం ఉంది. దీంతో ఈసారి నోటిఫికేషన్లు విడుదల చేస్తే అప్లికేషన్​ ఫీజుల ద్వారానే రూ. 100 కోట్ల ఆదాయం రానున్నట్లు అంచనా. గతంలో టీఎస్​పీఎస్సీ 36 వేల పోస్టులను 120 నోటిఫికేషన్లు విడుదల చేయగా.. అప్లికేషన్​ ఫీజుల ద్వారా రూ. 89 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఈసారి శాఖల వారీగా ఎక్కువ పోస్టులు ఉండటం, నిరుద్యోగులు కూడా విడుదలయ్యే అన్నింటికీ దరఖాస్తు చేసేందుకు సిద్ధమవుతుండటంతో దరఖాస్తులతో దండిగా ఆదాయం రానుంది.

Advertisement

Next Story