Rega Kantha Rao: తాటి వెంకటేశ్వర్లు పార్టీ మార్పుపై రేగా సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2022-06-24 07:54:48.0  )
Rega Kantha Rao Comments On Thati venkateswarlu Resignation
X

దిశ, కొత్తగూడెం: Rega Kantha Rao Comments On Thati venkateswarlu Resignation| ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, రైతు బంధు, దళిత బంధు, 24 గంటల విద్యుత్, ఇంటింటికీ తాగునీటి సౌకర్యం, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టి దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూసేలా కేసీఆర్ పరిపాలన సాగుతోందన్నారు.

ఈ క్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే రేగా సమాధానాలు చెప్పారు. తాటి వెంకటేశ్వర్లు రాజీనామాపై మాట్లాడుతూ పోటీని తట్టుకోలేని వారు, ధైర్యం సరిపోని వారు రాజీనామా చేస్తారన్నారు. పినపాక నియోజకవర్గం కరకగూడెం జెడ్పీటీసీ రాజీనామాపై స్పందిస్తూ వ్యక్తిగతంగా 100 ఓట్లు కూడా రాబట్టుకోలేని వారు రాజీనామా చేస్తే పార్టీకి ఎలాంటి నష్టం లేదని అన్నారు. ఇదే క్రమంలో జలగం వెంకటరావు కొత్తగూడెం నుండి పోటీ చేస్తారని గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఆయన ఏ పార్టీ నుండి పోటీ చేస్తారో మాకు తెలియదు అంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా.. ఆయన ఎలా పోటీ చేస్తారని అన్నారు. ఇంకా అధిష్టానం ఎవరికీ టికెట్లు ప్రకటించలేదన్నారు. లీడర్లు కంగారుపడి తొందరపాటు నిర్ణయాలు, స్టేట్మెంట్లు ఇస్తున్నారని అన్నారు. పోడు భూముల సమస్యపై స్పందిస్తూ.. పోడు భూముల వ్యవహారంలో తగ్గేది లేదన్నారు. పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇప్పించడానికి సాయశక్తులా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story