పెళ్లి కొడుకుగా భద్రాద్రి రాముడు.. ఆడంబరంగా సీతారాముల కళ్యాణం

by Javid Pasha |
పెళ్లి కొడుకుగా భద్రాద్రి రాముడు.. ఆడంబరంగా సీతారాముల కళ్యాణం
X

దిశ, భద్రాచలం : శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై సంచరించిన పుణ్య ధామం భద్రగిరి. ఇక్కడ జరిగే శ్రీరామనవమి దేశవ్యాప్త కొలమానం. రామాయణ రసరమ్య సన్నివేశాలతో పులకించే భద్రగిరి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. ఏప్రిల్ 10న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం, ఏప్రిల్ 11న శ్రీరామ పట్టాభిషేకం వేడుకలు జరగనున్న నేపథ్యంలో దేవస్థానం ఏర్పాట్లను గావిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం భద్రాద్రి రాముడు పెళ్లి కొడుకుగా భక్తులకు సాక్షాత్కరించనున్నారు. రాములోరి సన్నిధిలో వసంతోత్సవం, డోలోత్సవం వేడుక జరగనుంది. ఈ వేడుకల్లో భాగంగా నిండు ముత్తయిదువులు పెళ్లి పసుపుకొమ్ములు దంచు తారు.

దేవస్థానం అధికారులు ముత్యాల తలంబ్రాలను కలుపుతారు. దీంతో పెళ్లి పనులు ప్రారంభమైనట్లు భావిస్తారు. పాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు ప్రతి ఏటా ఈ అరుదైన వేడుకను దేవస్థానం నిర్వహిస్తోంది. గుక్క గులాలు, అత్తరు పన్నీరు, సుగంధ ద్రవ్యాలతో కూడిన వసంతాన్ని పెళ్లి కొడుకుగా ముస్తాబైన భద్రాద్రి రామునిపై అర్చకస్వాములు వసంతాన్ని చల్లుతారు. స్వామివారికి జోలలు, లాలతో డోలోత్సవం వేడుకను కన్నుల పండువగా నిర్వహిస్తారు.

ఆడంబరంగా రామయ్య కళ్యాణం

దక్షిణ అయోధ్యగా భావిస్తున్న శ్రీ భద్రాచల రామ క్షేత్రంలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా కోవిడ్ ఎఫెక్ట్ నేపథ్యంలో కేవలం కొద్ది మంది అర్చకుల సమక్షంలోనే రామయ్య కళ్యాణం జరిగింది. భక్తులకు ఈ వేడుక ప్రత్యక్షంగా చూసే భాగ్యం లేకపోయింది. అయితే ఈసారి కోవిడ్ ఎఫెక్ట్ కాస్త తగ్గిన నేపథ్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం వేడుక భక్తుల సమక్షంలో మిథిలా ప్రాంగణంలో నిర్వహించాలని దేవస్థానం భావించి అందుకు తగ్గ ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిపారు. మరోసారి కలెక్టర్ అధ్యక్షతన ఈ నెల 19న సమావేశం జరగనుండగా, తిరిగి ఈ నెల 21న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది.


బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సంబంధించి ఇప్పటికే 15 టెండర్ వర్క్ లకు సంబంధించిన పనులకు దేవస్థానం కసరత్తులు చేస్తోంది. ఐదు వర్క్ లకు సంబంధించిన పనులు ప్రస్తుతం ప్రారంభమయ్యాయి. రూ. 1 కోటి 10 లక్షలకు పైగా వ్యయంతో దేవస్థానం ఈ పనులను చేపడుతోంది. మిథిలా ప్రాంగణంలో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాలు సంబంధించి భక్తులకు ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయాన్ని దేవస్థానం ఇప్పటికే ప్రారంభించింది. గతం కంటే టికెట్ రేట్లను దేవస్థానం ఈ ఏడాది పెంచింది

రేపు సంధ్యా హారతులు లేవు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో శుక్రవారం వసంతోత్సవం జరుగుతున్న నేపథ్యంలో శ్రీ సీతా రామచంద్ర స్వామి వారికి నిర్వహించే స్వర్ణ అలంకారం, సంధ్య హారతి వేడుకను నిలిపివేసినట్లు దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని దేవస్థానం సూచించింది.

Advertisement

Next Story