అధిక మొత్తం చెక్‌ల క్లియరెన్స్ కోసం పీఎన్‌బీ బ్యాంక్ కొత్త నిర్ణయం!

by Disha Desk |
అధిక మొత్తం చెక్‌ల క్లియరెన్స్ కోసం పీఎన్‌బీ బ్యాంక్ కొత్త నిర్ణయం!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) అధిక మొత్తం కలిగిన చెక్కుల మోసాల నుంచి ఖాతాదారులకు భద్రత కల్పించేందుకు పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలకు పాజిటివ్ పే సిస్టమ్(పీపీఎస్)ను తప్పనిసరి చేయనున్నట్లు వెల్లడించింది. రూ. 10 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువైన చెక్‌ల కోసం ఏప్రిల్ 4 నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు మంగళవారం బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. 2021, జనవరి 1 నుంచి సీటీఎస్ క్లియరింగ్ సమయంలో రూ. 50 వేల కంటే ఎక్కువ విలువైన చెక్‌ల కోసం ఈ పీపీఎస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎన్‌పీసీఐ రూపొందించిన పీపీఎస్ ద్వారా అధిక మొత్తం కలిగిన చెక్‌లను సరిచూసే సమయంలో ఖాతాదారుల వివరాలను తప్పనిసరిగా తిరిగి ధృవీకరించాలి. పీఎన్‌బీ వినియోగదారు ఖాతా నంబర్‌తో సహా చెక్ నంబర్, చెక్ ఆల్ఫా కోడ్, నగదు మొత్తం, జారీ చేసిన తేదీ, లబ్ధిదారు పేరు లాంటి వాటిని తెలియజేయాల్సి ఉంటుంది. చెక్ క్లియర్ కావడానికి కనీసం 24 గంటల ముందు ఈ వివరాలను బ్యాంకుకు ఇవ్వాలి. వినియోగదారులు ఇంటర్నెట్ బ్యాంక్, ఎస్ఎంఎస్, మొబైల్ బ్యాంకింగ్, బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి వివరాలను తెలియజేయాలి. ఇదే సమయంలో రూ. 5 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువైన చెక్‌లను క్లియర్ చేసేందుకు కూడా పీపీఎస్ అమలు చేసేందుకు బ్యాంకులకు అవకాశం ఉంది.

Advertisement

Next Story