Piyush Goyal: సమావేశానికి TRS మంత్రి డుమ్మా.. సీరియస్ అయిన కేంద్రమంత్రి!

by GSrikanth |   ( Updated:2022-07-06 09:34:39.0  )
Piyush Goyal Serious On State Civil Supplies Minister Gangula Kamalakar Due to not attending to meeting
X

దిశ, వెబ్‌డెస్క్: Piyush Goyal Serious On State Civil Supplies Minister Gangula Kamalakar Due to not attending to meeting| కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌పై కేంద్ర ఆహార, వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేయడం రాజకీయంగా సంచలనం అవుతోంది. మంగళవారం ఢిల్లీలో రాష్ట్రాల ఆహార శాఖ మంత్రులతో దేశంలో పౌష్టికాహార భద్రతపై సదస్సు జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ గైర్హాజరు అయ్యారు. ఆయనతో పాటు ఒరిస్సా, జార్ఖండ్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మరియు నాగాలాండ్ రాష్ట్రాల మంత్రులు హాజరు కాలేదు. ముఖ్యమైన సదస్సుకు మంత్రులు డుమ్మా కొట్టడంపై పీయూష్ గోయల్ సీరియస్ అయ్యారు. సమావేశానికి హాజరు కానీ మంత్రుల వివరాలను నోట్ చేసుకున్నానని సంబంధిత మంత్రులకు ఈ విషయాన్ని తెలియజేయాలని సదస్సుకు హాజరైన అధికారులకు పీయూష్ గోయల్ సూచించారు. సమావేశానికి మంత్రులు గైర్హాజరు కావడం అనేది వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ సమావేశానికి రాని మంత్రులు ఇకపై ఏదైనా సమస్య తలెత్తి తనను కలవాలని భావించినా తనకు కూడా సమయం ఉండబోదని స్పష్టం చేశారు.

గంగుల వర్సెస్ పీయూష్ గోయల్:

ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ధాన్యం సేకరించాలని విజ్ఞప్తి చేసేందుకు ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందానికి పీయూష్ గోయల్ అవమానకర రీతిలో స్పందించారని గతంలో టీఆర్ఎస్ మంత్రుల బృందం ఆరోపణలు చేసింది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు పీయూష్ గోయల్‌ను కలిస్తే ఐదు సార్లు అవమానించినా భరించామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తాజా సదస్సుకు గంగులతో పాటు మరి కొన్ని రాష్ట్రాల మంత్రులు హాజరు కాకపోవడం ఆ విషయాన్ని పీయుష్ గోయల్ సీరియస్‌గా తీసుకోవడంతో మరోసారి టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య రాజకీయం ఆసక్తిగా మారింది.

100% వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్:

నిన్న జరిగిన సదస్సులో మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. భారత దేశం ఇప్పుడు 100 శాతం వన్ నేషన్ వన్ రేషన్ కార్డు కింద కనెక్ట్ అయిందని తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోడీకి, ఈ కార్యక్రమంతో అనుబంధం ఉన్న వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. త్వరలో దేశంలో ఆయుష్మాన్ భారత్ కార్డును తీసుకొస్తామని ఇందుకోసం డిజిటలైజ్డ్, ఆధార్ లింక్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను ఉపయోగిస్తామని వివరించారు. పోషకాహార భద్రతతో పాటు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఇతర రాష్ట్రాలు ఈ విధానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. వలస వచ్చిన పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయడంతో పాటు వారికి వైద్య సదుపాయం కల్పించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని వివరించారు. ఇక ఆహార భద్రత ర్యాంకులను ఈ సదస్సులో విడుదల చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉండగా, తెలంగాణ 12వ ర్యాంక్ లో ఉంది. ఒడిశా మొదటి స్థానంలో ఉండగా ఉత్తర్ ప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. గోవా చివరి స్థానం దక్కించుకుంది.

Advertisement

Next Story

Most Viewed