ఆ ఆస్పత్రిలో పెరిఫెరల్ బైపాస్ గ్రాఫ్ట్ సర్జరీ విజయవంతం..

by Vinod kumar |
ఆ ఆస్పత్రిలో పెరిఫెరల్ బైపాస్ గ్రాఫ్ట్ సర్జరీ విజయవంతం..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో మొట్టమొదటి సారిగా అరుదైన శస్త్ర చికిత్స (పెరిఫెరల్ బైపాస్ గ్రాఫ్ట్) విజయవంతంగా పూర్తి చేసినట్లు మెడికవర్ ఆస్పత్రి వైద్యులు తెలియజేశారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్టలో గల మెడికవర్ హాస్పిటల్ లోని సమావేశ మందిరంలో ఆస్పత్రి వైద్య బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసి(పెరిఫెరల్ బైపాస్ గ్రాఫ్ట్) సర్జరీ గురించి తెలియజేశారు.


ఓపెన్ హార్ట్ సర్జన్ డాక్టర్ అవిన్ సనార్, లాప్రోస్కోపీ సర్జన్ డాక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ.. వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామానికి చెందిన గోసంగి ఎర్రన్న(60) కొన్ని నెలలుగా తొడ కండరాల నొప్పులు, పిక్కల నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రికి రాగా పలు రకాల పరీక్షలు నిర్వహించి.. కాలు తొడ భాగంలో సుమారు 30 సెంటీమీటర్ల వరకు రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టడాన్ని గుర్తించి బైపాస్ సర్జరీ చేయాలని డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు.

పేషెంట్‌కు గతంలో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఎడమ కాలుకు సర్జరీ చేయించడం జరిగిందని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇక్కడే మెరుగైన వైద్యం అందిస్తామని డాక్టర్స్ బృందం భరోసా కల్పించడం తో వారి కుటుంబ సభ్యుల అంగీకారం తో తొడ బైపాస్ సర్జరీ నిర్వహించి రక్తనాలం మూసుకున్న భాగంలో మరో ట్యూబ్ అమర్చి ఆ ట్యూబ్ ద్వారా రక్తం సరఫరా అయ్యే విధంగా శస్త్ర చికిత్స విజయవంతం చేసినట్లు వైద్యులు తెలిపారు. అయితే హైదరాబాద్ ఆస్పత్రి కన్నా ఇక్కడ సగం ఖర్చులోనే చికిత్స అందించారాని పేషెంట్ బంధువులు తెలిపారు.

ఈ వ్యాధి బారిన పడటానికి ముఖ్య కారణం పొగ తాగడం, షుగర్, బీపీ ఎక్కువగా ఉండడం వల్ల జరుగుతుందన్నారు. అయితే ఈ వ్యాధి లక్షణాలు నడవడానికి ఇబ్బందిగా ఉండడం, ఎక్కువగా నడవకపోవడం, పిక్కల నొప్పి తో పాటు నరాలు పట్టేయడం దానికి తోడు రక్తనాళాల్లో రక్త సరఫరా అనేది తగ్గడం వల్ల ఈ వ్యాధి బారిన పడే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని వారు చెప్పారు.


శరీరంలోని ఏ భాగంలో నైనా రక్త సరఫరా సక్రమంగా జరగని ప్రాంతంలో నలుపు రంగులోకి మారడం, ఇలాంటి లక్షణాలు కనబడితే నిర్లక్ష్యం వహించకుండా రక్తనాళాల శస్త్రచికిత్స వైద్యనిపుణులను సంప్రదించాలని సూచించారు. నిర్లక్ష్యం వహించడం ద్వారా పూర్తిగా స్పర్శ కోల్పోయి కాలు తీసేసే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ వరుణ్ ఏలేటి మత్తు వైద్య నిపుణులు, మేనేజ్మెంట్ శ్రీనివాస్ శర్మ, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed