మంజూరైంది ఊరికి.. వేసిందేమో వెంచర్‌కి.. అధికార పార్టీ నేత నిర్వాకం

by Satheesh |
మంజూరైంది ఊరికి.. వేసిందేమో వెంచర్‌కి.. అధికార పార్టీ నేత నిర్వాకం
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: అధికారం ఉంటే చాలు.. ఏం చేసినా చెల్లుతుందని నిరూపిస్తున్నారు కొంతమంది నేతలు. ఈ కోవకే చెందుతుంది జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామంలో జరిగిన ఓ వ్యవహారం. ఈ ఘటన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి అవసరమైన సీసీ రోడ్డు నిర్మాణానికి 22లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. జనసంచారం ఉండే వీధులలో ఈ రోడ్డును వేయాల్సి ఉండగా.. అధికార పార్టీ నేతలు ఆ రోడ్డు రూట్ మార్చివేసి అవసరం లేని చోట నిర్మాణం చేపట్టారు.

అధికార పార్టీకి చెందిన ఓ నేత తన భూమికి మరింత విలువ రావాలని.. అవసరమైతే వెంచర్ చేయాలనే ఉద్దేశంతో సీసీ రోడ్డును తన పొలం వద్దకు వేయించాడు. దాదాపు 22లక్షల రూపాయల వ్యయంతో అవసరమైన చోట కాకుండా వేరే చోట నిర్మాణం జరుపుకుంటున్న.. అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు కొంతమంది వ్యక్తులు ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను సామాజిక మాధ్యమాలలో షేర్ చేశారు. దీనిపై గ్రామ సర్పంచ్ బషీర్‌ను వివరణ కోరగా మున్ముందు అవసరాల మేరకే అక్కడ రోడ్డు వేశాం. పాఠశాల భవనం గదులను త్వరలోనే అక్కడ నిర్మించబోతున్నమని దాటవేశారు.

Advertisement

Next Story

Most Viewed