మట్టి.. నిబంధనలకు తుట్టి.. విచ్చలవిడిగా మట్టి విక్రయాలు

by Manoj |
మట్టి.. నిబంధనలకు తుట్టి.. విచ్చలవిడిగా మట్టి విక్రయాలు
X

దిశ,వరంగల్ టౌన్: మట్టి వ్యాపారం నగరంలో కొందరికి కుటీర పరిశ్రమగా మారిపోయింది. వరంగల్ నగర శివారు ప్రాంతాల్లో ఈ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. కొందరికి పాలకులు, మరికొందరికి అధికారులు అండగా నిలుస్తునట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్ నగరంలో కాశిబుగ్గ, లేబర్ కాలనీ, దేశాయిపేట, రంగశాయిపేట ప్రాంతాల్లో ఈ మట్టి దందా కొన్నేళ్లుగా విరాజిల్లుతున్నట్లు తెలుస్తోంది.

మట్టితో పాటు ఇసుక వ్యాపారం కూడా మూడు ట్రాక్టర్లు.. ఆరు ట్రిప్పులుగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో 'దిశ'దిన పత్రికలో వచ్చిన కథనానికి రెవెన్యూ శాఖ అధికారులు స్పందించినా అంతా తూతూ మంత్రమేననే విమర్శలు వినిపిస్తున్నాయి. స్వయంగా రెవెన్యూ ఇన్స్ పెక్టర్ ఈ మట్టి దందా పై విచారణ చేపట్టినప్పటికీ చర్యలు తీసుకోవడంలో మీన మేషాలు లెక్కిస్తున్నట్లు సందేహాలు రేకెత్తుతున్నాయి. వాస్తవానికి మట్టి, ఇసుక దందాలపై మైనింగ్ శాఖ ప్రధానంగా దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది. కానీ, ఆ శాఖ అధికారులు సర్కారీ అల్లుళ్ళ లాగా ఆఫీసులకే పరిమితం కావడంతో ఈ మట్టి వ్యాపారం జోరుగా జబర్దస్త్‌గా సాగుతున్నట్లు తెలుస్తోంది. నగరం చుట్టుపక్కల నుంచి మట్టిని తీసుకొచ్చి నగరంలో విచ్చలవిడిగా విక్రయిస్తున్న ఏ శాఖ అధికారులు కూడా పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది.

అయితే నగరంలోకి మట్టి, ఇసుక ట్రాక్టర్లు ప్రవేశించే సమయంలో ట్రాఫిక్ పోలీసులు అమ్యామ్యాలకు అలవాటు పడి వదిలేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఎమ్మెల్యే నుంచి కార్పొరేటర్ వరకు పైరవీలు కొనసాగుతున్నాయని, ఈ నేపథ్యంలో రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు ఈ మట్టి వ్యాపారాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.అందుకే రెవెన్యూ అధికారులు చేపట్టిన విచారణ కేవలం తూతూ మంత్రమే ననే వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా అధికారులు తమ విధులను గుర్తించి, అక్రమంగా కొనసాగుతున్న మట్టి, ఇసుక దందాపై దృష్టి సాధించకపోతే ప్రజల్లో నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలు నిజమేనని తప్పదేమో?! మరి అధికారులు ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed