Ross Taylor: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌.. కన్నీటితో ఆటకు వీడ్కోలు

by GSrikanth |   ( Updated:2022-04-04 12:24:11.0  )
Ross Taylor: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌.. కన్నీటితో ఆటకు వీడ్కోలు
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికారు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. సుమారు 20 ఏళ్ల పాటు జట్టుకు సేవలందించిన రాస్ టేలర్, సోమవారం హమిల్టన్‌ వేదికగా నెదర్లాండ్స్‌‌తో జరిగిన మూడో వన్డేలో క్రికెట్ జీవితానికి గుడ్ బై చెప్పాడు. ఈ మ్యాచ్‌లో 16 బంతులు ఎదుర్కొన్న టేలర్ ఒక సిక్సర్‌‌తో 14 పరుగులు చేసి వాన్ బ్రీక్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌ చేరుకున్నాడు. కాగా, టేలర్‌ ఔటవ్వగానే స్టేడియంలోని ప్రేక్షుకులు, ఆటగాళ్లు చప్పట్లు కొడుతూ అతనికి స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. అంతకుముందు చివరిసారిగా బ్యాటింగ్‌ ఆడేందుకు మైదానంలోకి వచ్చిన ఈ కివీస్‌ స్టార్‌ క్రికెటర్‌కు నెదర్లాండ్‌ క్రికెటర్లు 'గార్డ్ ఆఫ్ హానర్' తో వెల్కమ్ చెప్పారు. ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు టేలర్‌. దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. జాతీయ గీతం ముగిసేదాకా కళ్లను తుడుచుకుంటూనే కనిపించాడు. ఆ సమయంలో టేలర్ సతీమణి, పిల్లలు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


కాగా, న్యూజిలాండ్ జట్టుకు 20 ఏళ్లుగా సేవలందిస్తోన్న రాస్ టేలర్.. ఇప్పటి వరకూ 445 అంతర్జాతీయ మ్యాచ్‌లాడి 18,074 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకూ 112 టెస్టులు ఆడిన టేలర్.. 7,683పరుగులు చేశాడు. ఇందులో 3 డబుల్‌ సెంచరీలు, 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 233 వన్డేలు ఆడి 8581 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు, 51 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 102 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లాడి 1909 రన్స్‌ చేశాడు. ఐపీఎల్‌లో వివిధ జట్ల తరఫున 55 మ్యాచ్‌లు ఆడి 1,017 పరుగులు చేశాడు. 2007 నుంచి 2016 వరకూ అన్ని టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో న్యూజిలాండ్ తరుపున ఆడిన రాస్ టేలర్‌ 2021 ప్రపంచకప్‌లో మాత్రం ఆడలేకపోయాడు. అయితే, నెదర్లాండ్స్‌‌తో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో గెల్చుకున్న కివీస్ చివరి వన్డేలోనూ ఘన విజయం సాధించింది. తద్వారా రాస్‌ టేలర్‌కు ఘనంగా వీడ్కోలు లభించినట్లయింది.

Advertisement

Next Story