అసెంబ్లీలో కొత్త రూల్.. పోడియం వద్దకు దూసుకొస్తే ఇక సస్పెండే!

by Nagaya |
ap assembly speaker tammineni sitaram
X

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై ప్రభుత్వం కొత్త నిబంధనను తీసుకువచ్చింది. స్పీకర్ పోడియం వద్ద ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనలను కట్టడి చేసేందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పోడియం వద్దకు దూసుకువస్తే ఆటో మేటిక్‌గా సస్పెండ్ అయ్యే రూలింగ్‌ను తీసుకువస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. పోడియం ముందు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు లైన్‌ను ఏర్పాటు చేశారు. ఎవరైనా సభ్యులు ఎరుపు లైన్‌ను దాటితే ఆటోమేటిక్‌గా సస్పెండ్ అయ్యేలా రూలింగ్ తీసుకొచ్చారు స్పీకర్. అంతే కాకుండా సస్పెండ్ అయిన సభ్యుడిని పంపడానికి ఇకపై సభ అనుమతి అవసరం లేకుండా ఈ రూలింగ్‌కు స్పీకర్ తమ్మినేని ఆమోదముద్ర వేశారు.

కాగా ఈ మధ్య అసెంబ్లీలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జంగారెడ్డిగూడెం ఘటనకు సంబంధించి అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరును కట్టడి చేసేందుకు వైట్‌,రెడ్‌, గ్రీన్‌ లైన్స్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ చీఫ్‌ శ్రీకాంత్‌రెడ్డి ప్రతిపాదించారు. శ్రీకాంత్‌రెడ్డి ప్రతిపాదించిన మోషన్‌కు సభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూల్‌ కమిటీకి స్పీకర్‌ తమ్మినేని సీతారాం సిఫార్సు చేశారు.

ఇకపోతే ఇదే రూల్‌ను గతంలో టీడీపీ ప్రభుత్వం సైతం తీసుకువచ్చింది. నాటి శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రూల్‌ను ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం స్పీకర్ పోడియం వద్ద తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు లైన్స్‌ దాటితే ఆటోమాటిక్‌గా సభ్యులు సస్పెన్షన్‌ అవుతారన్నది తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed