Telangana News: జిల్లాలో కొత్త కోర్టు.. ఇకపై ఆ అవసరం ఉండదన్న జడ్జి

by Javid Pasha |   ( Updated:2022-04-09 11:56:43.0  )
Telangana News: జిల్లాలో కొత్త కోర్టు.. ఇకపై ఆ అవసరం ఉండదన్న జడ్జి
X

దిశ, నారాయణపేట : నారాయణపేట ప్రజలకు సత్వర న్యాయం కోసం జిల్లా కోర్టు నెలకొల్పడం ఎంతో అవసరమని రాష్ట్ర హైకోర్టు జడ్జి జి. శ్రీదేవి అన్నారు. ఈ మేరకు శనివారం నారాయణపేట జిల్లాలో మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి, ఫస్ట్ క్లాస్ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు జడ్జి జి. శ్రీదేవి, జిల్లా కలెక్టర్ హరిచందనతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజలకు సత్వర న్యాయం, బెయిల్ కోసం మహబూబ్ నగర్‌కు వెళ్ళకుండా ఇక్కడే పొందే విధంగా జిల్లా కోర్టు ఉండడం చాలా అవసరమన్నారు. జిల్లా కోర్టు కోసం కూడా ఇదివరకే ప్రతిపాదనలు నడుస్తున్నాయని, ఒకవేళ జిల్లా కోర్టు రావడానికి ఆలస్యమైతే అదనపు జిల్లా జడ్జి కోర్టు అయినా త్వరలో ప్రారంభమయ్యే విధంగా తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు.

జిల్లా కోర్టు సముదాయానికి కావాల్సిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా నూతన కలెక్టరేట్ సమీపంలో కేటాయించడంపై హర్షం ప్రకటించారు. అన్ని రకాలైన కోర్టు భవనాలు ఒకే దగ్గర కలిగి ఉండటం చాలా అవసరమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వివిధ కోర్టుల్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు, సిబ్బంది ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కాగా అంతకు ముందు కోర్టు ప్రాంగణంలో పోలీస్ శాఖ చేసిన గౌరవ వందనాన్ని హైకోర్టు జడ్జి స్వీకరించారు. జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ..‌ నారాయణపేటకు జిల్లా కోర్టు వస్తేనే పూర్తి స్థాయి కోర్టులు వచ్చినట్లని, కోర్టు సముదాయానికి అవసరమైన స్థలాన్ని ఇప్పటికే కేటాయించినట్లు తెలిపారు.

కోర్టు అఫీషియల్స్ అందరూ సమిష్టిగా కృషి చేసి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించుకుంటున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా యంత్రాంగం తరపున జిల్లా న్యాయ వ్యవస్థకు కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ ప్రిన్సిపాల్ సివిల్ జడ్జి ప్రేమావతి మాట్లాడుతూ.. నారాయణపేటలో మున్సిపల్ కోర్టును 1908లో ప్రారంభించడం జరిగిందని, ఇది చాలా పురాతనమైన కోర్టు అని తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను 5 జిల్లాలుగా పునర్వ్యవస్థికరించడం జరిగిందని, అందులో భాగంగా నారాయణపేట జిల్లా కొత్తగా ఆవిర్భవించిందని చెప్పారు.


1999 నవంబర్ 27న సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభమైందని, హైకోర్టు ఆదేశాలతో అక్టోబర్ 9, 2020 నుంచి పోక్సో కేసుల విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ కోర్టు ప్రారంభమైనట్లు తెలిపారు. 2017లో ప్రభుత్వం ద్వారా 10 అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు మంజూరు చేసి 200 మంది సిబ్బందిని కేటాయించడం జరిగిందని.. ఇందులో భాగంగానే నేడు నారాయణపేట జిల్లాలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో సరైన కోర్టులు, న్యాయమూర్తులు, సిబ్బంది లేకపోవడం చేత అపరిష్కృత కేసుల సంఖ్య పెరిగిపోయిందన్నారు. జిల్లాలో సివిల్ కేసులు 1227, క్రిమినల్ కేసులు 2352 వెరసి 3579 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు.

జిల్లా ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కోర్టులో కేసుల సత్వర పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామని, ఇక ముందు పూర్తి సహకారం జిల్లా పోలీస్ శాఖ తరపున అందిస్తామని అన్నారు. నారాయణపేట బార్ కౌన్సిల్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ మాట్లాడుతూ.. నారాయణపేటలో చాలా కాలం నుండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పూర్తి స్థాయి మౌలిక వసతులు, పూర్తి బెంచ్ లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. నారాయణపేటకు జిల్లా కోర్టు, పూర్తి స్థాయి న్యాయమూర్తులను, సిబ్బందిని కేటాయించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అభ్యర్థించారు. అనంతరం బార్ కౌన్సిల్ తరఫున మెమొరాండం సమర్పించారు.

ఈ సందర్భంగా లైబ్రరీ కోసం సీనియర్ అడ్వకేట్ కరుణాకర్ రెడ్డి లక్ష రూపాయల చెక్కును హైకోర్టు జడ్జికి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ మధుసూదన్ రావు, మహబుబ్ నగర్ సీనియర్ సివిల్ జడ్జి వెంకట్రాం, ఫోక్సో జడ్జి ఉమాదేవి, సీనియర్ సివిల్ జడ్జి శుభ వల్లి, జూనియర్ సివిల్ జడ్జి రాజేందర్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, వైస్ ప్రెసిడెంట్ నందు నామాజీ, సంయుక్త కార్యదర్శి భీమా రెడ్డి, కోశాధికారి లక్ష్మీపతి గౌడ్, స్పోర్ట్స్ వెంకట్ రాజు, సీనియర్ న్యాయవాదులు నాగురావ్ నామాజీ, వెంకట్ రెడ్డి, ఆకుల బాలప్ప, మల్లికార్జున్, సీతారాం, రఘువీర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed