- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'సింహాల గర్జన'పై అబ్జెక్షన్.. మమ్మల్నెందుకు పిలవలేదన్న విపక్షాలు
న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవనంపై 9,500 కేజీల రాగితో తయారు చేసిన 'జాతీయ చిహ్నం' చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. 6.5 మీటర్ల ఎత్తున్న ఈ ఎంబ్లమ్‌ని ప్రధాని మోడీ ఆదివారం ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దీని నమూనాపై విపక్షాలు, సామాజిక కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అశోకుడి జాతీయ చిహ్నంలోని సింహాలు, ఎంతో మనోహరంగా, పూర్తి విశ్వాసంతో శాంతియుతంగా ఉన్నట్టు కనిపిస్తే, నూతన పార్లమెంట్ భవనంపై నిర్మించిన చిహ్నంలోని సింహాలు మాత్రం ఉగ్రరూపంతో, గర్జిస్తున్నట్టుగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఈ మార్పుతో కేంద్రం జాతీయ చిహ్నాన్ని అవమానించిందని విమర్శిస్తున్నారు. దీన్ని వెంటనే మార్చి, అసలైన చిహ్నాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తున్నారు.
దేశంలోని ప్రతిదాన్నీ తినేలా ఉంది: ఆర్జేడీ సెటైర్లు
తాజాగా ఆవిష్కరించిన జాతీయ చిహ్నం నమూనాపై లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) పార్టీ వ్యంగ్యంగా స్పందించింది. 'అసలైన జాతీయ చిహ్నంలోని సింహాలు తేలికపాటి భావాలను వ్యక్తీకరించినట్టు ఉంటాయి. కానీ, ప్రస్తుత అమృతకాలంలో నిర్మించిన ఈ జాతీయ చిహ్నంలోని సింహాలు మాత్రం.. మనుషుల్ని వేటాడటం, దేశంలో దొరికిన ప్రతి దాన్ని తినాలన్న ధోరణితో ఉన్నట్టు కనిపిస్తోంది' అంటూ ట్విట్టర్‌లో కేంద్రంపై పరోక్ష విమర్శలు చేసింది. టీఎంసీ రాజ్యసభ ఎంపీ జవహార్ సిర్కర్ స్పందిస్తూ, అశోక సింహాలకు అవమానం జరిగిందని ఆరోపించారు. ఇది సిగ్గుచేటని, దీన్ని వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. టీఎంసీకి చెందిన మరో ఎంపీ మహువా మోయిత్రా సైతం పార్లమెంటుపై నిర్మించిన జాతీయ చిహ్నాన్ని, మరోచోట నిర్మించిన చిహ్నం ఫొటోలను పక్కపక్కన పెట్టి పోస్టు చేశారు. దీనిపై ఎలాంటి కామెంట్ చేయలేదు.
'మమ్మల్నెందుకు పిలవలేదు'
జాతీయ చిహ్నం నమూనాపైనే కాకుండా, ఆవిష్కరణ కార్యక్రమంపైనా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. యావత్ దేశానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నం విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు అన్ని పార్టీలనూ పిలవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆరోపిస్తున్నాయి. అలాగే, లోక్‌సభకు నేతృత్వం వహించేది స్పీకర్ అని, అలాంటప్పుడు, జాతీయ చిహ్నాన్ని ప్రధాని ఎలా ఆవిష్కరిస్తాయని ప్రశ్నిస్తున్నాయి. 'పార్లమెంటు, జాతీయ చిహ్నం దేశంలోని ప్రజలందరివి. ఒక వ్యక్తికి సంబంధించినవి కావు' అని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ ట్వీట్ చేశారు. 'రాజ్యాంగబద్ధమైన అధికారాల విభజన'కు ప్రధాని తూట్లు పొడిచారని విమర్శించారు. 'ప్రభుత్వాధినేతగా ఉన్న ప్రధాని, జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించి ఉండాల్సి కాదు. రాజ్యాంగ నిబంధనలన్నింటినీ ప్రధాని ఉల్లంఘించారు' అని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు.
మాపై ఎవరి ఒత్తిడి లేదు: విగ్రహ రూపకర్తలు
నూతన పార్లమెంటుపై నిర్మించిన జాతీయ చిహ్నంపై వస్తున్న అభ్యంతరాలకు దాని రూపకర్తలు సునిల్ డియోల్, రోమియల్ మోసస్ స్పందించారు. దీని తయారీలో తమపై ఎవరూ ఒత్తిడి తీసుకురాలేదని తెలిపారు. ప్రతి భాగాన్నీ ఎంతో ఏకాగ్రతతో రూపొందించామని వెల్లడించారు. 'అసలైన జాతీయ చిహ్నంలోని సింహాల వ్యక్తిత్వం, ఈ విగ్రహంలోని సింహాల వ్యక్తిత్వం ఒకేలా ఉంది. చిన్న చిన్న తేడాలు మాత్రమే ఉండి ఉంటాయి. ఇది చాలా పెద్ద విగ్రహం కాబట్టి, కింది నుంచి చూసేవారి దృష్టిలో వేరుగా కనిపించవచ్చు' అని తెలిపారు. ఈ విగ్రహ తయారీ పట్ల ఎంతో గర్వంగా ఉన్నామని వెల్లడించారు.
చిల్లర రాజకీయాలు: బీజేపీ
జాతీయ చిహ్నంపై వస్తున్న విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడింది. ఈ మేరకు బీజేపీ ఐటీ సెల్ విభాగం అధికారి అమిత్ మాలవీయ ట్విట్టర్‌లో స్పందిస్తూ, 'పార్లమెంటు భవనంపై ఉన్న జాతీయ చిహ్నం సారనాథ్ మ్యూజియంలో భద్రపరిచిన అశోక రాజధాని సారనాథ్ లయన్ నుండి స్వీకరించబడింది. దానికి తగ్గట్టే విగ్రహాన్ని రూపొందించాము. ఎలాంటి మార్పులూ చేయలేదు. ప్రింట్‌లోని 2డి చిత్రాలను ప్రతిపక్షాలు 3డీ నిర్మాణంతో పోలుస్తున్నారు. వారికి మతి చెడింది' అని వెల్లడించారు.