కృష్ణ నీటి వాటాను పొందడంలో విఫలమైనందుకే నీటి ఇక్కట్లు: మాజీ మంత్రి నాగం

by S Gopi |
కృష్ణ నీటి వాటాను పొందడంలో విఫలమైనందుకే నీటి ఇక్కట్లు: మాజీ మంత్రి నాగం
X

దిశ, నాగర్‌కర్నూల్: టీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా నీటి వాటాను పొందడంలో ఘోరంగా విఫలమైందని, అందుకే రైతులు తాగు, సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ నాగం జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పరిధిలోని కాలువల కింద ఎండిపోయిన పంటలను మీడియా ప్రతినిధులతో సహా బస్సుయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాల ద్వారా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రూపకల్పన జరిగిందని, ఉమ్మడి పాలమూరు జిల్లాను కరువు రహిత జిల్లాగా మార్చేందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మించిందన్నారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని.. అందులో భాగంగానే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, పిల్ల కాలువల నిర్మాణం చేపట్టలేదన్నారు. దాని పర్యవసానమే నేడు తాగు సాగునీటికి మళ్లీ కటకట ఏర్పడిందన్నారు.

మరో మూడు నెలల్లో వేసవి రానుందని, శ్రీశైలంలో కృష్ణ నీరు అడుగంటి పోయిందని.. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం ఇస్తుందన్నారు. నీటి వాటాను పొందడంలో వైఫల్యం చెందడం వల్లే కృష్ణా నీరు మొత్తం ఆంధ్రకే తరలిపోయిందని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం మరి కల్వకుర్తి ప్రాజెక్టు నీటి పంపింగ్ ఎందుకు నిలుపుదల చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాటలు నమ్మి ప్రాజెక్టు కింద వేసుకున్న పంటలన్నీ ప్రస్తుతం ఎండిపోయాయని మండిపడ్డారు. కాలువల కింద వేసుకున్న వందలాది ఎకరాల వరి, మొక్కజొన్న, మినుములు, ఆముదం, వేరుశనగ వంటి పంటలను పరిశీలించారు. పెట్టుబడి అయిన ఖర్చు ఎంత అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో రైతు సుమారు లక్షల్లో ఖర్చు చేశారని కాల్వల నుండి దూరప్రాంతాలకు పైపుల ద్వారా నీటిని పారించుకున్నారని, దీంతో పెద్ద సంఖ్యలో రైతులు నష్టపోయారన్నారు. కాలువలో దించుకున్న మోటార్లకు విద్యుత్ శాఖ అధికారులు డీడీలు కట్టించుకున్నారు కానీ.. కాలువలో నీరు రాదన్న విషయాన్ని చెప్పలేదన్నారు. ముందస్తుగా చెప్పకపోవడంతో రైతులంతా తీవ్రంగా నష్టపోయారని విచారం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed