పోరాటం చేస్తూనే అనుకున్న పని పూర్తి చేస్తా : జగ్గారెడ్డి

by Manoj |
పోరాటం చేస్తూనే అనుకున్న పని పూర్తి చేస్తా : జగ్గారెడ్డి
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: నా జీవితం అంతా పోరాటమేనని కాంగ్రెస్​ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పోరాటం చేస్తూనే తాను అనుకున్న పని పూర్తి చేసే వరకు ఆరాటపడుతుంటానన్నారు. సంగారెడ్డిలోని వాసవి మహా సంస్థాన్​‌‌–శ్రీవాసవి కన్యక పరమేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్​గా కాంగ్రెస్​ నాయకులు అనంత కిషన్​ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య​అతిథిగా హాజరై మాట్లాడుతూ మొదటి నుంచి పోరాటాలతోనే నా జీవితం కొనసాగుతున్నదన్నారు. అది చేస్తా, ఇది చేస్తా అని ఎలాంటి వాగ్దానాలు చేయను. మీరు మనసులో అనుకుంటున్నది త్వరలోనే చేస్తానని ఆలయ కమిటీ సభ్యులకు జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమానికి విచ్చేసిన రంగంపేట పీఠాధిపతి శ్రీ

మాధవానంద సరస్వతీ అంటే ఎంతో ఇష్టపడతానని, స్వామి చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతారన్నారు. ప్రతి ఒక్కరు కూడా అలాగే గడపాలని కోరుకుంటున్నానని జగ్గారెడ్డి అన్నారు. చైర్మన్​గా ప్రమాణ స్వీకారం చేసిన అనంత కిషన్​ను జగ్గారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. కాగా ఇటీవలే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్​ బాధ్యతల నుంచి జగ్గారెడ్డిని అధిష్టానం తప్పించిన విషయం తెలిసిందే. ఆ తరువాత పీసీసీ అధ్యక్షుడి రేవంత్​రెడ్డి తీరును తప్పుబడుతూ మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జగ్గారెడ్డిపై అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ తరుణంలో తన జీవితం అంతా పోరాటమేనని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల ఆయన రాజకీయ వ్యాఖ్యలకు, మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed