ఆ నియోజకవర్గంలో నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి..

by Vinod kumar |   ( Updated:2022-03-17 13:19:30.0  )
ఆ నియోజకవర్గంలో నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి..
X

దిశ, బాన్సువాడ: రాజకీయాలు అంటేనే పరస్పర నిందారోపణలు, విమర్శల జడివానలు, వ్యక్తిగత దూషణలు, ఎత్తుకు పై ఎత్తులు, కుట్రలు కుతంత్రాలు, అవకాశాల ఆధిపత్య పోరులు, సామ, వేద, దాన, దండోపాయాల మాయ జాలాలు. గెలుపోటముల్లో ఎన్నెన్నో లీలలు.. మరెన్నో మజిలీలు.. బాన్సువాడ నియోజకవర్గంలో జరుగుతున్న నేటి రాజకీయాలు వీటికి అతీతమేమీ కావు. నియోజకవర్గ త్రిముఖ పోరులో మాటల తూటాలు గట్టిగానే పేలుతున్నాయి.


ఇక్కడ నువ్వొకటంటే మేం పదంటాం అన్నట్టు. సీన్ సీన్ కు ఈల వేసేలా రూద్రూర్ రైతు దీక్షలో బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కాసుల బాలరాజ్ చేసిన ఇసుక, మైనింగ్ మాఫియా వ్యాఖ్యలు పోచారం తనయులకు గట్టిగానే తగిలాయని పొలిటికల్ సర్కిల్ లో ఒకటే చర్చ.

ఇది మొదలు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన చేసిన స్పీకర్ కాదు సీఎం ఇంట్లో స్వీపర్ వ్యాఖ్యలు హస్తం హవాను పెంచగా, పెద్దాయనను కించపర్చారని కారు డ్రైవర్లు(గులాబీ శ్రేణులు) కన్నెర్ర చేశారు.


నేను సైతం అంటూ రాజకీయ కదన రంగంలోకి కమల దళం కాలు దువ్వింది. పోచారం తనయులే మైనింగ్ మాఫియాకు ఆద్యులని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి మాల్యాద్రి రెడ్డి చేసిన వ్యాఖ్య అగ్గి రాజేసింది. మా నాయకులనంటే గుర్రం బొమ్మకు కట్టేసి కొడతాం ఖబర్దార్ అంటూ గులాబీ దళం.. కమలం సౌండ్ కు రీ సౌండ్ ఇచ్చింది.

బాన్సువాడ పట్టణంలోని భూ కబ్జా రాయుళ్లు కొందరు పోచారం తనయులైన భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డిలను కోడ్ భాషలో పిలుస్తారని విమర్శలను పీక్ కు తీసుకెళ్లారు. భాస్కర్ రెడ్డి ని బాబర్ ఖాన్, సురేందర్ రెడ్డి ని సలీం ఖాన్ అని కోడ్ భాషలో పిలుస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాజకీయ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్ లో పెను దుమారమే రేపాయి.


బీజేపీ కి అలవాటైన, అచ్చొచ్చిన భాషలో మల్యాద్రి రెచ్చిపోయారని కొందరి అభిప్రాయం. అంబులెన్స్ ఆపి నరికిన చరిత్ర నీది, నీ బామ్మర్ది మాయం తీరు అందరికీ తెలుసంటూ.. గులాబీ గుంపు పంబ రేపింది. ఇలా ఒకరిని మించి ఒకరు, ఒకరిపై మరొకరు దూషణల కత్తులు దూయడం నియోజకవర్గంలో కొత్త సాంప్రదాయానికి తెర తీసినట్టయింది. మరి మైనింగ్ మాఫియా మంటలు, స్పీకర్ కాదు స్వీపర్ వ్యాఖ్యలు, గుర్రం బొమ్మకు కట్టేసి కొడతామనే హెచ్చరికలు, బాబర్ ఖాన్, సలీం ఖాన్ అనే మారు పేర్ల ప్రస్తావనలు ఎక్కడికి తీసుకెళ్తాయో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed