ట్రైన్‌లో మ‌హిళ‌కు ముద్దు పెట్టాడ‌ని 7 ఏళ్ల త‌ర్వాత కోర్టు ఈ శిక్ష వేసింది..!

by Sumithra |   ( Updated:2022-05-04 11:34:39.0  )
ట్రైన్‌లో మ‌హిళ‌కు ముద్దు పెట్టాడ‌ని 7 ఏళ్ల త‌ర్వాత కోర్టు ఈ శిక్ష వేసింది..!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః విచ‌క్ష‌ణ లేకుండా ప‌శువులా ప్ర‌వ‌ర్తించే మ‌గ‌వాళ్ల‌కు ఇదొక హెచ్చ‌రిక‌, అలాగే, న్యాయం నాలుగు కాళ్ల‌మీద ఎంత స్పీడ్‌గా న‌డుస్తుందో తెలియ‌డానికి ఈ కేసు ఒక ఉదాహ‌ర‌ణ కూడా. వివ‌రాల్లోకి వెళితే, లోకల్ ట్రైన్‌లో ఓ మహిళకు బలవంతంగా ముద్దుపెట్టిన కేసులో 37 ఏళ్ల కిరణ్ సుబ్రాయ హోనావర్‌ను ముంబై కోర్టు ఏడేళ్ల త‌ర్వాత‌ దోషిగా నిర్ధారించింది. తాజాగా ఇచ్చిన తీర్పులో అత‌నికి ఏడాది పాటు కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10,000 జరిమానా విధించింది. అయితే, నిందితుడు తన పిటిషన్‌లో, ఈ చర్య ఉద్దేశపూర్వకంగా చేయలేదని, తన వెనుక ఉన్న ఒక ప్రయాణీకుడు తనను నెట్టాడని, ఫలితంగా అతను మహిళపై పడ్డాన‌ని, దాని ఫలితంగా అతని పెదవులు ఆమె చెంపను తాకినట్లు పేర్కొన్నాడు. అయితే, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ విపి కేదార్ అతని అభ్యర్థనను తిరస్కరించారు.

ఈ విషయంపై విచారణ జరుపుతున్నప్పుడు, 'ఒక మహిళ ఆ వ్య‌క్తి రూపాన్ని, స్పర్శను బట్టి అతని ఉద్దేశాన్ని అంచనా వేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని' కోర్టు పేర్కొంది. 'పురుషుల కంటే స్త్రీలు చాలా ఎక్కువ గ్రహణశక్తి కలిగి ఉంటారని, ఇది సాధారణంగా మహిళల అంతర్ దృష్టి సంకేత‌మ‌ని, మహిళల్లో అశాబ్ధిక‌ సంకేతాలను గ‌మ‌నించ‌డం, అర్థంచేసుకోవడం వంటి సహజమైన సామర్థ్యం ఉంది' అని కోర్టు పేర్కొంది. 'పురుషుడు తనను తాకినప్పుడు లేదా చూసినప్పుడు అతని ఉద్దేశం స్త్రీకి తెలుస్తుంది' అని కోర్టు స్ప‌ష్టం చేసింది.

Advertisement

Next Story