అలా చేయడంలో కేసీఆర్ ఎప్పుడు ముందుంటారు: ఎంపీ ప్రభాకర్ రెడ్డి

by Satheesh |
అలా చేయడంలో కేసీఆర్ ఎప్పుడు ముందుంటారు: ఎంపీ ప్రభాకర్ రెడ్డి
X

దిశ, కంది: గ్రామాలు, పట్టణాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నాయకత్వం ముందుకు సాగుతోందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయిస్తానని చెప్పి.. వెంటనే నిధులు మంజూరు చేసి సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఎంపీ తెలిపారు. శనివారం సంగారెడ్డి మండల పరిధిలోని నాగపూర్, ఇర్గిపల్లి, కల్పగుర్, కులబగుర్, ఫసల్వాది, హనుమాన్ నగర్, గౌడిచెర్ల గ్రామాల్లో రూ.8.40 కోట్లతో వేయనున్న సీసీ రోడ్ల పనులను స్థానిక మాజీ ఎమ్మెల్యే, సంగారెడ్డి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింత ప్రభాకర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.

టీఆర్ఎస్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యం..

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెతో పాటు పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితమేనని కొత్త ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. కొద్ది రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బహిరంగ సభలో అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని కోరడం జరిగిందన్నారు. కాగా, సీఎం కేసీఆర్ వెంటనే నియోజకవర్గంతో పాటు జిల్లాకు మొత్తం రూ.364 కోట్ల నిధులు విడుదల చేస్తూ వెంటనే జీవోను కూడా జారీ చేశారని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ముందుంటారని ఎంపీ అన్నారు.

సంగారెడ్డి, సదాశివపేట, కంది గ్రామాల్లో వెలసి ఉన్న 11వ శతాబ్దపు శివాలయాలను వెంటనే పునరుద్ధరించి అభివృద్ధి చేసేలా కృషి చేస్తానని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. వీటితో పాటు కొండాపూర్ మండలంలోని మ్యూజియం అభివృద్ధికి కూడా కృషి చేసేలా కేంద్ర ఆర్కాలజీ శాఖతో మాట్లాడి అందుకు అవసరమైన నిధుల కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, జెడ్పీటీసీ సునీత మనోహర్ గౌడ్, సర్పంచులు అమృతమ్మ, మణెమ్మ, మంజుల పండరినాథ్, పట్నం నిర్మల మాణిక్యం, మోహన్ నాయక్, టీఆర్ఎస్ సంగారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed