కేంద్ర ప్రభుత్వానికి మంత్రి పువ్వాడ స్ట్రాంగ్ వార్నింగ్..

by Satheesh |
కేంద్ర ప్రభుత్వానికి మంత్రి పువ్వాడ స్ట్రాంగ్ వార్నింగ్..
X

దిశ, ఖమ్మం: ధాన్యం కొనుగోలుపై కేంద్రం సరైన నిర్ణయం తీసుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావులు బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశంలో రైతుల స్థితిగతులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఖమ్మం నగరంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రి అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ ఆక‌లి సూచిక‌లో 116 దేశాల్లో స‌ర్వే చేస్తే భారత దేశం స్థానం 101 అని.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా క‌ళ్లు తెర‌వాలని ధ్వజమెత్తారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల తర్వాత మ‌న దేశం స్థానం ఎక్కడుందో చూసుకోవాలన్నారు. నాడు ఓ విప్లవ క‌వి అన్నట్లు 'అన్నపు రాశులు ఒక‌వైపు.. ఆక‌లి కేక‌లు ఇంకోవైపు' అని ప్రస్తుతమున్న పరిస్థితి అలానే ఉందని.. భార‌త‌దేశంలో ఆక‌లి కేక‌లు పెరిగాయని నిప్పులు చెరిగారు. దశాబ్దాల అరిగోస తర్వాత ఇప్పుడిప్పుడే సన్నబువ్వ తింటున్న తెలంగాణ నిరుపేదల ఆత్మగౌరవాన్ని కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసిందని అన్నారు. వడ్లు వేయండి కేంద్రంతో కొనేలా చేస్తానన్న బండి సంజయ్ ఆ దిశగా కృషి చేయాలని డిమాండ్ చేశారు.

హరితవిప్లవం వల్ల పంజాబ్‌లో వరి ఉత్పత్తి పెరిగింది అలాంటి కేంద్ర ప్రోత్సాహం లేకుండానే వరిలో అగ్రస్థానానికి తెలంగాణ ఎదిగిందని స్పష్టం చేశారు. పంజాబ్‌లో కొన్నట్లే తెలంగాణలోనూ మొత్తం ధాన్యం కొనాలని డిమాండ్​ చేశారు. ధాన్యం సేకరణలో కేంద్రానిది ముమ్మాటికీ వైఫల్యమేనని కేంద్ర ప్రభుత్వం తన అసమర్థతను ఒప్పుకోవాలన్నారు. ధాన్యం కొనలేమంటున్న కేంద్రం ఎందుకు కొనరో నేరుగా, వివరంగా ప్రజలకు చెప్పాలని డిమాండ్​చేశారు. ధాన్యం విషయంలో పీయూష్‌ గోయల్‌ పచ్చి అబద్దాలు మాట్లాడారని పేర్కొ్న్నారు. ఇప్పుడు కేంద్రం బాయిల్డ్‌ రైస్‌ తీసుకోమంటే రాష్ట్రంలో పండించే మొత్తం రైస్‌ తీసుకోమని చెప్పినట్లేనని విమర్శించారు. రాజకీయాల కోసం రైతులను, ప్రజలను బీజేపీ మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు రైతుల పక్షాన పోరాడే సత్తా లేదని దుయ్యబట్టారు. రైతుల కోసం పార్లమెంట్‌లో పోరాటం చేసేది టీఆర్ఎస్ మాత్రమేనని వారు తెలిపారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం నీరు, కరెంటు, రైతుబంధు, రైతుభీమా ఇచ్చి పంటలు సాగు చేసేలా ప్రోత్సహించిందని.. ఇన్ని చేసినందుకు మాది రైతు వ్యతిరేక ప్రభుత్వమా? అని ప్రశ్నించారు. దేశ ప్రజలను అన్ని విషయాలలో కేంద్రం మోసం చేసిందని ఫైర్ అయ్యారు. దశాబ్దాలుగా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి రైతులను వలసబాట పట్టించింది కాంగ్రెస్ నాయకులేనని విమర్శించారు. సమావేశంలో ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షుడు తాతా మధు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed