ఉప్పల్‌లో కేటీఆర్ కీలక ప్రకటన.. వారందరికి గుడ్ న్యూస్..

by Satheesh |   ( Updated:2022-03-11 12:14:35.0  )
ఉప్పల్‌లో కేటీఆర్ కీలక ప్రకటన.. వారందరికి గుడ్ న్యూస్..
X

దిశ, నాచారం: అర్హులైన లబ్ధిదారులకు వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నామ‌ని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఉప్పల్ నియోజ‌క‌వ‌ర్గంలోని మ‌ల్లాపూర్‌, నాచారం, రామంతపూర్, ఉప్పల్ ప్రాంతాలలో పలు అభివృద్ధి పనులను మంత్రి చామకూర మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాశ్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లతో కలిసి మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. మల్లాపూర్‌లో నూత‌నంగా రూ. 4 కోట్లతో నిర్మించిన వైకుంఠ‌ధామం, నాచారం హెచ్ఎంటీ పెద్ద చెరువు వద్ద రూ.411 కోట్లతో ఎస్‌టీపీ పనులు, ఉప్పల్‌లో రూ.450 కోట్లతో ఫ్లైఓవర్ థీమ్ పార్క్, రామంతపూర్‌లో రూ.2.2 కోట్ల వ్యయంతో ఎస్ఎన్‌డీపీ పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాశ్ రెడ్డి అధ్యక్షతన మ‌ల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. ఉప్పల్‌లో రూ.10 కోట్ల 32 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేప‌ట్టామ‌న్నారు.


తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథకాల్లో దేశంలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7300 కోట్ల వ్యయంతో హైదరాబాద్ రూపురేఖలు మార్చామని చెప్పారు. అలాగే హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా 1000 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. గ‌తేడాది వ‌ర్షాలు బాగా కురిసిన‌ప్పుడు చాలా ఇబ్బంది ప‌డ్డామని.. ప్రతి నీటి మురికి చుక్కను మూసీలోకి వ‌దిలేలా చ‌ర్యలు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. ఉప్పల్ వ‌ద్ద ట్రాఫిక్ బాగా పెరిగిపోతోందని.. దీంతో ఇక్కడ ఫ్లై ఓవ‌ర్లు, స్కైవేలు క‌డుతున్నామ‌ని వెల్లడించారు. ఉప్పల్‌లో అంత‌ర్జాతీయ ప్రమాణాల‌తో రూ. 35 కోట్ల స్కై వాక్‌ను నిర్మిస్తున్నాం. దాన్ని వ‌చ్చే నెల‌లోనే ప్రారంభిస్తామ‌న్నారు.

సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో అభివృద్ధి శ‌ర‌వేగంగా జ‌రుగుతోందన్నారు. వ‌చ్చే నెల‌లో చ‌ర్లపల్లిలో ఆర్‌యూబీ పూర్తి చేసి ప్రారంభిస్తామ‌ని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రావు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ, ఎస్‌ఈ అశోక్ రెడ్డి, కాప్రా సర్కిల్ ఈఈ కోటేశ్వరరావు, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, నాచారం కార్పొరేటర్ సాయిజన్ శాంతి శేఖర్, హెచ్‌బీ కాలనీ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, చిల్కానగర్ కార్పొరేటర్ బన్నల గీత ప్రవీణ్, మాజీ కార్పొరేటర్లు శ్రీనివాస్ రెడ్డి, కొత్త రామారావు, దన్ పాల్ రెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కాప్రా, ఉప్పల్ సర్కిల్ అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed