ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

by Mahesh |   ( Updated:2022-03-05 10:58:03.0  )
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
X

దిశ, మునుగోడు: అధికార అహంభావంతో జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే కు సమాచారం ఇవ్వకుండా పర్యటిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా మంత్రికి దమ్ము, ధైర్యం ఉంటే కేసీఆర్ దగ్గర జిల్లా అభివృద్ధి గురించి చర్చించాలని సవాల్ విసిరారు. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో నల్గొండ జిల్లా ఎంత వరకు అభివృద్ధి చెందిందో మంత్రి తెలుసుకోవాలన్నారు.

గ్రామాల్లో మస్కూరు చేయాల్సిన పనులు మంత్రి చేయడమేంటని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఆత్మగౌరవ నినాదంతో పార్లమెంట్‌లో కాంగ్రేస్ పార్టీ ఎంపీగా తను కొట్లాడి, సోనియా గాంధీని ఒప్పించి సాధించుకున్న తెలంగాణను కొందరు స్వార్థ రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ కాళ్ల దగ్గర పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ పాలనకు బానిసలై టీఆర్ఎస్ నాయకులు బానిస బ్రతుకులు బతుకుతున్నారన్నారు. తెలంగాణలో కేసీఆర్ సీఎం అయ్యాక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మంత్రులు, ప్రజాప్రతినిధులు కైనా గౌరవం ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ కనుసన్నల్లో ఐఏఎస్, ఐపీఎస్‌లు పని చేస్తున్నారన్నారు.

కేసీఆర్ నియంత పాలనలో పోలీస్టేషన్లు, తహశీల్దార్ కార్యాలయాలు టీఆర్ఎస్‌కు అండగా మారాయని అన్నారు. రాజ్యాంగ బద్ధమైన హక్కులు అణిచి వేస్తున్న కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, చౌటుప్పల్ జడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, నాయకులు నకరకంటి యాదయ్య, తాటికొండ సైదులు, దోటి నారాయణ, సాగర్ల లింగస్వామి, జాజుల సత్యనారాయణ, మేకల మల్లయ్య, పంతంగి స్వామి, మేకల ప్రమోద్ రెడ్డి, పందుల శ్రీను, బోయ సురేష్, ఐతగోని విజయ్, అనంత సాయి, మునుగోటి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed