Stock Market: లాభాలతో అదరగొట్టిన స్టాక్ మార్కెట్లు!

by Harish |   ( Updated:2022-04-26 12:54:33.0  )
Stock Market: లాభాలతో అదరగొట్టిన  స్టాక్ మార్కెట్లు!
X

Stock Market

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాల నుంచి బయటపడ్డాయి. గత రెండు సెషన్లలో భారీ నష్టాలను చూసిన తర్వాత మంగళవారం సూచీలు కనిష్ఠాల వద్ద అధిక లాభాలను సాధించాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు, దేశీయంగా మదుపర్లు కొనుగోళ్లకు మద్దతివ్వడంతో రోజంతా స్టాక్ మార్కెట్లు(Stock Market) సానుకూలంగానే కదలాడాయి. దీనికితోడు ముడి చమురు ధరలు కూడా తగ్గడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఆసియా మార్కెట్లలో సైతం కొనుగోళ్లు జరగడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 776.72 పాయింట్లు ఎగసి 57,356 వద్ద, నిఫ్టీ 246.85 పాయింట్లు పెరిగి 17,200 వద్ద ముగిశాయి. నిఫ్టీలో రియాల్టీ, ఆటో, బ్యాంకింగ్ రంగాలు అధికంగా 2 శాతానికి పైగా రాణించగా, మిగిలిన రంగాలు కూడా సానుకూలంగానే ట్రేడయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుక్, టీసీఎస్ కంపెనీల షేర్లు మాత్రమే నష్టాలను ఎదుర్కొనగా, మిగిలిన అన్ని స్టాక్స్ లాభాల్లో ర్యాలీ అయ్యాయి. ముఖ్యంగా పవర్‌గ్రిడి, టైటాన్, ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఎల్అండ్‌టీ, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, హిందూస్తాన్ యూనిలీవర్, సన్‌ఫార్మా కంపెనీల షేర్లు 2 శాతానికి పైగా పుంజుకున్నాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.57 వద్ద ఉంది.

Advertisement

Next Story