రాజరికపు వ్యవస్థ కోసమే రాజ్యాంగం మార్చాలని కుట్ర..

by Vinod kumar |
రాజరికపు వ్యవస్థ కోసమే రాజ్యాంగం మార్చాలని కుట్ర..
X

దిశ, నాగర్‌కర్నూల్: తెలంగాణలో సీఎం కేసీఆర్ రాజరికపు వ్యవస్థను నిర్మించుకునేందుకు బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సైతం మార్చాలని కుట్ర పన్నుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. శుక్రవారం పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా సంక్రమిస్తున్న హక్కులన్నింటిని కాలరాస్తూ సామాజిక న్యాయం, సమానత్వాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవాలనే అక్కసు వెళ్లగక్కుతున్నాడని మండిపడ్డారు. ఒక రాజు లాగా వ్యవహరిస్తూ రాజరికపు వ్యవస్థ నిర్మాణం కోసం కేసీఆర్ పని చేస్తున్నాడని, ఈ రాజరిక పోకడలతో ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని మండిపడ్డారు.


కొన్ని మీడియా సంస్థలు పత్రికలు ఈ విషయాలను ప్రతిఘటించి ప్రజలకు తెలుపుతున్నారని భయంతో వారిపై కేసులు బనాయించి హింసిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం గా పిలవబడే మీడియా వ్యవస్థను నిర్బంధించాలనుకోడం సిగ్గుచేటన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే అన్ని వర్గాల వారు హక్కులు పొందుతున్నారని ప్రస్తుతం ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు.


వచ్చే నెల ఏప్రిల్ 9న రాజ్యాంగ పరిరక్షణ కోసం హైదరాబాద్ లో యుద్ధభేరి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆయనతో పాటు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్, గూటా విజయ్ తదితరులు ముఖ్య నేతలు హాజరయ్యారు.

Advertisement

Next Story